మీకు గుర్తుందా? జూన్ 15న భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. గాల్వాన్ లోయలో ఈ ఘటన జరిగింది. అయితే.. అమరులైన 20 మంది భారత జవాన్లకు భారత ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
ఇదే ఘర్షణలో చైనా సైనికులు కూడా దాదాపు 40 మంది దాకా మరణించినట్టు తెలిసింది. కానీ.. చైనా తమ సైనికులు చనిపోయినట్టుగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
కానీ.. ప్రస్తుతం ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. అది సమాధికి సంబంధించిన ఫోటో. అది కూడా చైనా సైనికుడి సమాధి.
ఆరోజు జరిగిన ఘర్షణలో చైనా సైనికులు మరణించారు అనడానికి ఈ సమాధే నిదర్శనం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ముందుగా చైనాలో వైరల్ అయిన ఈ ఫోటో తర్వాత భారత్ లోనూ వైరల్ అయింది.
ఈ ఫోటోలోని సమాధి.. చైనా సైనికుడు చెన్ కు చెందిందిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో రాసి ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సమాధిని దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్ లో నిర్మించినట్టుగా ఆ ఫోటోలో రాసి ఉంది. 2020 ఆగస్టు 5న దీన్ని నిర్మించారట. ఈ ఘర్షణలో మరణించిన సైనికుడి వయసు 19 సంవత్సరాలు. ఆ సైనికుడు 2001లో పుట్టినట్టుగా అక్కడ రాసి ఉంది.
అంతే కాదు.. 69316 దళం సైనికుడు అని పింగ్నాన్, పుజియాన్ ఆయన ప్రాంతం అని రాసి ఉంది. జూన్ 2020లో భారతదేశ సరిహద్దు దళాలతో జరిగిన ఘర్షణలో ఆయన ప్రాణం త్యాగం చేశారు. అందుకే ఆయన మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ ఆయన్ను గుర్తుగా ఈ సమాధిని నిర్మించింది.. అని అందులో రాసి ఉన్నట్టు తెలుస్తోంది.
దీన్న బట్టి చూస్తే.. అప్పుడు జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన చాలామంది సైనికులు మరణించి ఉంటారని.. కావాలనే చైనా తమ సైనికుల మరణాల సంఖ్యను ప్రపంచానికి చెప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. భారత జవాన్లు చైనాకు బాగానే బుద్ధి చెప్పారు.. అంటూ భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేస్తున్నారు ఇండియన్స్. ఈ ఫోటోనే సోషల్ మీడియాలో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్.