Perni Nani : చిరంజీవి సినిమా కోసం చొక్కాలు చించుకున్నాం: మంత్రి పేర్ని నాని

Perni Nani : చాలా చాలా చిత్రమైన సందర్భమిది. మంత్రి పేర్ని నాని, మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం చొక్కాలు చించుకున్నోళ్ళం మేం.. ఆయన స్థాయి ఏంటి.? మా స్థాయి ఏంటి.? నాకు పదే పదే ఫోన్ చేసేవారు.. చిన్న పిల్లాడిలా మారి, పరిశ్రమ కోసం పరితపించారు..’ అని చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, సినీ పరిశ్రమ తరఫున లీడ్ తీసుకుని, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరుల్ని వెంటేసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నిన్న సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించిన విషయం విదితమే.

వైఎస్ జగన్‌తో చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో, ‘చేతులు జోడించి..’ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘సినీ పరిశ్రమ అంటే అది ఏ ఒక్కరిదో కాదు.. అందరిదీ..’ అన్నోళ్ళెవరూ, సినీ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదు.

అసలు, చిరంజీవి ఎందుకు ‘లీడ్’ తీసుకోవాలి.? ఆయనకు మాత్రమే బాధ్యత వుందా.? సోకాల్డ్ పెద్దల్లో ఇంకెవరికీ బాధ్యత లేదా.? అన్న చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ విషయంలో తీవ్రస్థాయి విమర్శలు చేసే పేర్ని నాని, మెగాస్టార్ చిరంజీవి విషయంలో మాత్రం, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాల్లేవు, వుండవు కూడా. అయితే, చిరంజీవి ఆలోచనా విధానం వేరు, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి వేరు.

‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించిందీ పరిశ్రమ సమస్యల గురించే.. ఇప్పుడు చిరంజీవి పరితపిస్తున్నదీ పరిశ్రమ గురించే. పరిశ్రమలో చిరంజీవిపైనా అక్కసు కనిపిస్తోంది, పవన్ కళ్యాణ్ మీదా అక్కసు మామూలే.!