Perni Nani : పదవి పోతుందనుకుంటే.. అదనపు పదవి వచ్చిందహో.!

Perni Nani :మంత్రి పేర్ని నాని తన పదవిని కోల్పోబోతున్నారంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా అలాగే, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు పేర్ని నాని. సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్యమంత్రి వద్దనే వున్నా, ఆ శాఖ వ్యవహారాలు కూడా పేర్ని నాని చూసుకుంటున్నారు.

ఇప్పుడిక అధికారికంగా పేర్ని నానికి, సినిమాటోగ్రఫీ శాఖని బదిలీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దాంతో, పేర్ని నానికి మరింత ‘పవర్’ వచ్చినట్లయ్యింది. గత కొంతకాలంగా సినిమా పరిశ్రమకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది.

సినిమా టిక్కెట్ల వ్యవహారం కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు నానా రకాల వివాదాలూ తెరపైకొస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని, సినీ పరిశ్రమ పెద్దలతో పలుమార్లు చర్చించారు, చర్చిస్తూనే వున్నారు.. సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖను పేర్ని నానికి బదలాయించడం ద్వారా, మరింత మెరుగైన రీతిలో పేర్ని నాని ఈ శాఖకు సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షించడానికి వీలవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించారట.

ఇదిలా వుంటే, సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని, రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుని, డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగించడం, అలాగే రకరకాల వివాదాల కారణంగా ఏర్పడ్డ కమ్యూనికేషన్ గ్యాప్‌ని తొలగించడం.. వంటి అంశాలపై ఇకనుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా పేర్ని నాని మరింత స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారని అంటున్నారు.

ఇంతకీ, మంత్రి పదవి కోల్పోబోతున్నారంటూ పేర్ని నాని మీద దుష్ప్రచారం చేసినవాళ్ళు.. ఇప్పుడేమంటారో.!