తెలంగాణలో తాజాగా అందరూ చర్చిస్తున్న విషయం ఒకటే. డబుల్ బెడ్ రూం ఇళ్లు. అసెంబ్లీలోనూ దీని గురించి చర్చ వాడీవేడీగా జరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. తమతో వస్తే ఇళ్లను చూపిస్తామని మంత్రి తలసాని కాంగ్రెస్ నాయకులకు చెప్పిన సంగతి తెలిసిందే. భట్టీ ఆ సవాల్ ను స్వీకరించి.. నిన్న తలసానితో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించడానికి వెళ్లారు.
అక్కడి వరకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి తలసానికి అక్కడ ఉన్న స్థానికుల నుంచి నిరసన వ్యక్తమయింది. డబుల్ బెడ్ రూం ఇళ్లను అడుగుతుంటే కొందరు కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారని.. డబ్బులు చెల్లిస్తేనే ఇళ్లు ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద అంత డబ్బు ఎక్కడిది? లక్షలకు లక్షలు తెచ్చి కట్టాలంటే తమ వల్ల కాదని వాళ్లు మంత్రి తలసానితో చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల కోసమేనా ఈ హడావుడి
త్వరలో గ్రేటర్ ఎన్నికలు రానుండటంతో… ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారంటూ అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తూనే ఉంటారు. ఇంకెప్పుడు వాటి నిర్మాణం పూర్తవుతుందంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి తలసాని… నగరంలోని జియాగూడ, నాంపల్లి, ఖైరతాబాద్, అంబేద్కర్ నగర్, బోయిగూడ, వెస్ట్ మారెడ్ పల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశించారు. ఎక్కడికెళ్లినా… వాళ్లకు నిరసనే వ్యక్తం అయింది.
లక్ష ఇళ్లను చూపించే వరకు పర్యటిస్తూనే ఉంటా
మంత్రి తలసాని సవాల్ మేరకు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించే వరకు తిరుగుతూనే ఉంటా. నేనే మాత్రమే కాదు.. నాతో పాటు క్వాలిటీ టీమ్ కూడా ఉంది. వాళ్ల రిపోర్ట్ వచ్చాక డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి మాట్లాడుతాం.. అని భట్టి విక్రమార్క తెలిపారు.