మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకోసం పండగ లాంటి వార్త తీసుకొచ్చాం. పీఎఫ్ అకౌంట్ ఉంటే ఉద్యోగులకు ఎంత భరోసా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉద్యోగ విరమణ తర్వాత జీవితం హాయిగా సాగడం కోసం.. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉద్యోగి తన జీవితాన్ని గడపడం కోసం ఉద్దేశించే పీఎఫ్ అకౌంట్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఉద్యోగి జీతంలో కొంత.. ఉద్యోగి కంపెనీ కొంత కలిపి ప్రతినెలా పీఎప్ అకౌంట్ లో జమచేస్తారు. దాంట్లో కొంత పెన్షన్ కోసం సపరేట్ గా దాస్తారు. ఆ పెన్షన్ అమౌంట్ ను ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే.. ప్రస్తుతం ప్రతి నెలా జమ చేస్తున్న పెన్షన్ అమౌంట్… ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి సరిపోయేలా లేదట. అప్పుడెప్పుడో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పీఎఫ్ పెన్షన్ అమౌంట్ ను జమ చేయడం లేదని.. అందుకే పెన్షన్ లిమిట్ ను పెంచాలంటూ వినతులు వస్తున్నాయి.
ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సభ్యులు కూడా ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీని కోసం పీఎఫ్ అకౌంట్ పెన్షన్ లిమిట్ ను పెంచాలంటూ వాళ్లు మంత్రిత్వ శాఖకు ప్రపోజల్ పంపారు.
ఈఎస్ఐసీ స్కీమ్ కోసం ఉద్యోగి జీతం లిమిట్ ను 21 వేలకు ఎలా పెంచారో.. పీఎఫ్ కంట్రిబ్యూషన్ లిమిట్ ను కూడా పెంచాలంటూ బోర్డు సభ్యులు వెల్లడించారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ లిమిట్ ను పెంచితే ఆటోమెటిక్ గా పెన్షన్ లిమిట్ కూడా పెరుగుతుంది. దీంతో ఉద్యోగి పీఎఫ్ అమౌంట్ పెద్ద మొత్తంలో రావడంతో పాటుగా.. పెన్షన్ డబ్బు కూడా ఎక్కువగానే వస్తుంది.
ప్రస్తుతం పీఎఫ్ కంట్రిబ్యూషన్ లిమిట్ 15 వేలు ఉండగా.. దాన్న 25 వేలకు పెంచాలంటూ ప్రపోజల్ పెట్టారు. ఉద్యోగి నుంచి ఎంత డబ్బు పీఎఫ్ కోసం కంట్రిబ్యూట్ చేస్తే.. అదే విధంగా కంపెనీ కూడా అంతే మొత్తం పీఎఫ్ అకౌంట్ లో జమ చేయాల్సి ఉంటుంది.
దీనిపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. ఒకవేళ.. మంత్రిత్వ శాఖ ఈ ప్రపోజల్ కు ఓకే చెబితే.. పీఎఫ్ ఖాతాదారులందరూ పండగ చేసుకోవడమే ఇక. ఉద్యోగి తన ఉద్యోగాన్న మానేసినా.. పదవీ విరమణ పొందినా.. పెద్ద మొత్తంలో పీఎఫ్ అమౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.