‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

‘పెళ్లిసందడి’ సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్‌తో సినిమా వస్తోంది. అదీ పెద్దాయన రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణలోనే. దర్శకత్వం పర్యవేక్షణతో పాటు, అసలు మాట్లాడడమే అరుదైన పెద్దాయన ఈ సినిమాతో తొలిసారి స్ర్కీన్‌పై కనిపిస్తుండడం విశేషం. ఇకపోతే, ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా, కొత్తమ్మాయి శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్రరావు సినిమాల్లోని హీరోయిన్స్ చాలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. సరిగ్గా అలాంటి లక్షణాలే శ్రీలీలలో కనిపిస్తున్నాయి.

ఆకట్టుకునే అందంతో పాటు, అభినయం కూడా బాగా పలికిస్తోంది శ్రీలీల. తెలుగులో ఈ ముద్దుగుమ్మకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ, ఆల్రెడీ కన్నడ సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. అలా అని కన్నడ భామ అనుకుంటే పొరపాటే. అచ్చమైన తెలుగమ్మాయి. అయితే, అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఇక పెయిర్ విషయానికి వస్తే, టాలీవుడ్‌లో ఇప్పుడిదే హాటెస్ట్ పెయిర్ అంటున్నారు. అంతలా ఈ జంట సినిమా రిలీజ్‌కి ముందే ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఈ సినిమాకి సంబంధించి, ఇంతవరకూ రిలీజైన ప్రచార చిత్రాలు, ప్రోమోలు ఆ విషయాన్ని పదే పదే నిరూపిస్తున్నాయి. గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కెుతోన్న ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్టు, ‘పెళ్ళిసందడి’ భామ శ్రీలీల కూడా ‘ఉప్పెన’ బ్యూటీ తరహాలోనే తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది.. వరుసగా ఆమెకు ఆఫర్లు వచ్చి పడుతున్నాయట.