చిరంజీవి కాకపోతే టాలీవుడ్‌లో ఇంకెవరు.?

Peddarikam In Tollywood

Peddarikam In Tollywood : పెద్దరికం.. పెద్దరికం… ఈ అంశం చుట్టూ సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా చాలా రచ్చ జరుగుతోంది. దాసరి నారాయణరావు జీవించి వున్నప్పుడు.. ఆయనే పెద్ద తలకాయ్. పరిశ్రమకు సంబంధించి ఏ సమస్య వచ్చినా, దాసరి పేరు వినిపించేది. సరే, ఆయన ఆ సమస్యను పరిష్కరించేవారా.? లేదా.? అన్నది వేరే చర్చ.

దాసరి తర్వాత, ఆ పెద్దరికం చిరంజీవికి వచ్చింది. చిరంజీవి దగ్గరకు వెళ్ళిన ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతూ వచ్చింది. కానీ, చిరంజీవిని పరిశ్రమ పెద్ద దిక్కుగా ఒప్పుకునేందకు సినీ పరిశ్రమలో కొందరు సుముఖత వ్యక్తం చేయలేదు సరికదా, చిరంజీవి పెద్దరికాన్ని ప్రశ్నించడానికి సోకాల్డ్ సినీ ప్రముఖులు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

ఈ నేపథ్యంలో తాను పెద్ద దిక్కుని కాదనీ.. తనకు పెద్దరికం వద్దే వద్దనీ.. పరిశ్రమ పెద్ద అనే హోదా తనకు అవసరం లేదనీ, తాను పరిశ్రమ బిడ్డను మాత్రమేనని చిరంజీవి చెబుతూ వస్తున్నారు. ‘చిరంజీవి ఏమైనా అనుకోనీ.. ఎవరైనా ఆయన మీద విమర్శలు చేసుకోనీ.. ఆయనే పరిశ్రమ పెద్ద..’ అనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

తాజాగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో సినీ కార్మికుల తరఫున ఓ కార్యక్రమం ఏర్పాటైతే, అక్కడా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మెగాస్టార్ చిరంజీవిని పరిశ్రమ పెద్దగా అభివర్ణించారు. పరిశ్రమ తరఫున చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఆయా సమస్యల్ని పరిష్కరించినట్లు తలసాని చెప్పుకొచ్చారు.

అయితే, సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్.. పరిశ్రమ పెద్దగా చిరంజీవి పేరుని డిక్లేర్ చేసినా.. దాన్ని పరిశ్రమలో కొందరు అంగీకరించరుగాక అంగీకరించరు. పోనీ, అలాంటోళ్ళు పరిశ్రమ సమస్యల పట్ల సందిస్తారా.? అంటే, స్పందించరాయె.