జగన్ జిల్లాలో పవన్.. విమర్శలు చేస్తే వ్యతిరేకత తప్పదేమో?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పటికి పూర్తవుతుందో ఆయనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు సైతం క్లారిటీ లేదనే సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాలలో యాక్టివ్ కావాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా పరిస్థితులు మాత్రం ఆయనకు అనుకూలించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలకు దూరంగా ఉన్నారు.

వైరల్ ఫీవర్ వల్ల రాజకీయ యాత్రలకు దూరమైన పవన్ మళ్లీ రాజకీయ యాత్రలతో బిజీ కావాలని అనుకుంటున్నారు. కడప జిల్లా నుంచి పవన్ కౌలు రైతుల భరోసా యాత్రను మొదలుపెట్టనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఈ నెల 20వ తేదీన పవన్ పర్యటించనుండగా పవన్ ఏం మాట్లాడతాడో అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. కడప శివారు ప్రాంతాలలో ఒకటైన సిద్ధవటంలో ఈ సభ జరగనుంది.

కడపలో జగన్ ను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 2019 ఎన్నికల్లో కడపలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. జగన్ పై ఒక్క నెగిటివ్ కామెంట్ చేసినా తట్టుకోలేని వాళ్ల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఛాన్స్ దొరికితే జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి అస్సలు వెనుకాడరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక్కడ పవన్ పర్యటన విజయవంతం కావడం సులువైన విషయం అయితే కాదనే చెప్పాలి. వైసీపీ నేతలు సైతం పవన్ పర్యటన సక్సెస్ కాకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.