తమిళనాడు అసెంబ్లీలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ, ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు, మీ ొక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకూ మార్గదర్శకం.. స్ఫూర్తి దాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కి ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని యధాతథంగా తమిళనాడు అసెంబ్లీలో ఓ మంత్రి చదవి వినిపించారు. తెలుగులోనూ, తమిళంలోనూ సదరు మంత్రి పవన్ కళ్యాణ్ ట్వీటుని చదివి వినిపించడం గమనార్హం.
స్టాలిన్ డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో వుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – ఏఐఏడీఎంకే పార్టీల కూటమిని కాంగ్రెస్ – డీఎంకే కూటమి ఓడించిన విషయం విదితమే. తెలుగు నాట జనసేన – బీజేపీ పొత్తులో వున్నాయి. ఆ లెక్కన స్టాలిన్ మీద పవన్ కళ్యాణ్ ఎలా ప్రశంసలు కురిపించగలరు.? ఈ చర్చ ఇప్పుడు తెలుగునాట బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఎవరేమనుకున్నాసరే, మంచిని అభినందించడంలో పవన్ ఎప్పుడూ ముందుంటారన్నది జనసేన వాదన. నిజమే, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేవరకే రాజకీయం చేయాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రాజకీయాలు అలా లేవు కదా. అధికారంలోకి వచ్చాక, ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా సమాధి చేసెయ్యాలనే ఆలోచనలే కనిపిస్తున్నాయి తెలుగునాట. చంద్రబాబు హయాంలోనూ అదే జరిగింది, వైసీపీ హయాంలో కూడా అదే జరుగుతోంది. నిజానికి, వైసీపీ ఒకింత సంయమనం పాటిస్తోంది.. లేదంటే, టీడీపీ ఈపాటికి రాష్ట్రంలో గల్లంతయిపోయేదే.