AP: కూటమి సర్కారుకు ఏడాది…. పీడ విరగడైయింది కార్యక్రమంతో జగన్ కు కౌంటర్!

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోబోతుంది. జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఏడాది అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని జనసేన పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈయన సోమవారం పిఠాపురంలో రేషన్ దుకాణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి పార్టీ విజయోత్సవాన్ని సంబరంగా చేసుకోవాలని తెలిపారు.

జూన్ 4వ తేదీ ఉదయం “సుపరిపాలనకు ఏడాది ” పేరుతో మహిళలందరూ కూడా రంగువల్లులు వేసి ఐక్యతతో ఈ వేడుకొను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. అయితే జూన్ 4వ తేదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినముగా జరుపుకోవాలని అంటూ గతంలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం ఇచ్చిన మాట పై నిలబడకుండా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని అందుకే జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం జరుపుకోవాలని పిలుపునిచ్చిన అనంతరం జనసేన జగన్ కు కౌంటర్ ఇస్తూ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

జూన్ 4వ తేదీ ఉదయం సుపరిపాలనకు ఏడాది పేరుతో విజయోత్సవాలు నిర్వహించగా అదే రోజు సాయంత్రం “పీడ విరగడై ఏడాది” పేరుతో ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి పొందిన సందర్భాన్ని ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.