జనసేన అధినేత పవన్.. మరోసారి ‘అతిథి’లా ఆంధ్రప్రదేశ్‌కి

సినిమాల్లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా వున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆయన ఓ పార్టీకి అధినేత. 2024 ఎన్నికల్లో అధికారం తమదేనని చెప్పుకుంటోన్న జనసేన పార్టీకి అధినేత అయినప్పుడు, ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, జనంలో వుండాలి కదా.? కరోనా నేపథ్యంలో హైద్రాబాద్‌కే చాన్నాళ్ళు పరిమితమైపోయిన జనసేనాని, కరోనా ప్రభావం కాస్త తగ్గిన దరిమిలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులో వుండాలి. కనీసం, పార్టీ కార్యకర్తలకైనా ఆయన అందుబాటులో వుండాలి కదా.? వారంలో ఓ రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆయన సమయం కేటాయిస్తే, జనసైనికుల్లో కాస్తయినా ఉత్సాహం కనిపిస్తుంది. కానీ, ఆయనకున్న బిజీ సినీ షెడ్యూల్స్ కారణంగా ఆ మాత్రం సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు రాజకీయాలకి.

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన జనసేనాని, మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన త్రివర్ణ పతాకావిష్కరణలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేశారు.. రాజకీయ పరమైన విమర్శలూ చేశారు. పార్టీ ముఖ్య నేతలతోనూ, మిత్ర పక్షం బీజేపీ నేతలతోనూ చర్చలు జరిపారు. దీన్ని, కేవలం ‘అతిథి పాత్ర’ వ్యవహారంగానే చూస్తున్నారు ఏపీలో రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా పవన్ మాట్లాడటానికి చాలా సమస్యలున్నాయి. పోరాటాలు చేయడానికీ చాలా అంశాలున్నాయి. కానీ, పవన్ హైద్రాబాద్ వీడటానికి చాలా కష్టపడుతున్నారు. అందుకే, ఏపీ రాజకీయాల్లో ఆయనది అతిథి పాత్ర అన్న విమర్శలు ప్రతిసారీ గట్టిగానే వినిపిస్తున్నాయి.