జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆన ఢిల్లీకి వెళ్ళారట. ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఎవరెవర్ని కలిశారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. బీజేపీకి జనసేన పార్టీ తెలుగు నాట మిత్రపక్షం. అయితే, తెలంగాణ బీజేపీ మాత్రం జనసేనను మిత్రపక్షంగా గుర్తించడంలేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, అక్కడా బీజేపీ – జనసేన మధ్య ఎవరికీ అర్థం కాని బంధం నడుస్తోంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు.. అన్నట్టుగానే వుంది రెండు పార్టీల మధ్యా స్నేహం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్ళడమంటే.. ఒకింత ఆలోచించాల్సిన విషయమే ఇది. పవన్ ఢిల్లీ పర్యటనలో, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కనిపించడం చర్చనీయాంశమయ్యింది.
ఓ ప్రైవేటు కార్యక్రమం (బీజేపీ నేతకు చెందిన ఫ్యామిలీ ఫంక్షన్) సందర్భంగా ఇద్దరూ కలుసుకున్నారట. అసలు ఈ ఫంక్షన్ కోసమే పవన్, ఢిల్లీకి వెళ్ళారా.? పవన్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు రాజకీయమే లేదా.? అన్నది వేరే చర్చ. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలకు జగన్ సర్కార్ అనుమతివ్వకపోవడాన్ని నిలదీశారు. ‘వైఎస్సార్ వర్ధంతి వేడుకలకు కరోనా దూరంగా వుంటుందా.? వినాయక చవితి అనగానే దగ్గరైపోతుందా.?’ అని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. ‘గోతుల్ని గొయ్యిలుగా.. గొయ్యిలను చెరువులుగా మార్చడంలో వైసీపీ అభివృద్ధి సాధించింది..’ అని కూడా ఎద్దేవా చేశారు జనసేనాని. అంతా బాగానే వుందిగానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో జనసైనికులకైనా తెలుసా.? తెలిసి వుండకపోవచ్చు. వాళ్ళకీ పవన్ ఢిల్లీకి వెళ్ళడం షాకింగ్‌గానే వున్నట్టుంది.