Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆయన బహిరంగ వేదికలపై మాట్లాడే విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకునేది. తనకు కుల మతాలతో అవసరం లేదని,కమ్యూనిజం భావాలు, సర్వమతాలను గౌరవిస్తాను అంటూ తెగ ఊదరగొట్టేవారు. తాను హిందువు అని తన భార్య క్రిస్టియన్ అని నేను ప్రార్థనలు కూడా చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ముస్లింలు అంటే కూడా నాకు చాలా గౌరవం అని పలు వేదికలపై ఈయన తెలియజేశారు.
కమ్యూనిజం భావజాలం, సమన్యాయం అంటూ చెప్పే ఆయన మాటలకు ఎంతో మంది యువత బాగా కనెక్ట్ అయ్యారు. ఇలా ఒకప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం తాను మారిపోయానని చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా ఎన్నికలలో విజయం సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన కేవలం సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఇలా పలు సందర్భాలలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే యాత్రలు చేయటం మాలలు వేయటం చేశారు. ఇక తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు.
ఇదిలా ఉండగా తాజాగా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లింలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సంచలనగా మారింది.గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనదని.. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని ఆ పోస్టులో రాసుకొచ్చారు. గో మాతలను సంరక్షించుకొనే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరమని పిలుపునిచ్చారు. గో సంరక్షణ చేపట్టాల్సిన బాధ్యత ఉందని పవన్ వెల్లడించారు.
బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉందని.. అందుకే పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయనున్నారని.. వారికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. ఇలా బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ మరొక మతాన్ని టార్గెట్ చేసే విధంగా పోస్ట్ చేయడంతో విభిన్న శైలిలో ఈయనపై విమర్శలు వస్తున్నాయి.