పవన్ కళ్యాణ్ పేరు పలకాలంటే ఆ పేరుకు ముందు పవర్ స్టార్ అనే పదాన్ని ఉచ్చరించాల్సిందే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు సేనాని పవన్ కళ్యాణ్ అనాల్సిందే. కేవలం పేరులో ఈ మార్పు రావడం వెనుక పవన్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమాల్లో ఆయన కోరుకోకపోయినా సూపర్ క్రేజ్, విపరీతమైన స్టార్ డమ్, బోలెడు రికార్డులు అన్నీ దక్కాయి. కానీ రాజకీయాల్లో ఆయన ఆశించిన మార్పు మాత్రం అంత ఈజీగా దొరకడం లేదు. సినిమాల్లో ఉండగానే డబ్బును, కీర్తిని లెక్కచేయని తనం ఆయనలోని నిరాడంబరతను, డబ్బును సేవా కార్యక్రమాల కోసం మంచి నీళ్లలా ఖర్చు పెట్టడంతో ఆయనలోని దానగుణాన్ని, సమాజానికి మంచి చేయాలనే తపనను జనం చూశారు. ఆయనలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మంచిదని అన్నారు. పవన్ కళ్యాణ్ సైతం సేవ చేయాలంటే రాజకీయమే చక్కటి మార్గమని అనుకున్నారు. అందుకే ‘జనసేన‘ను స్థాపించారు.
ఉన్నత లక్ష్యాలను, కఠినమైన పార్టీ విధానాలను రూపొందించుకుని బరిలోకి దిగారు. ఆయన తనకు, తన పార్టీకి ఎన్ని విలువలు ఏర్పాటుచేసుకున్నా అన్నిటినీ మించిన డబ్బు రాజకీయాలు చేయకూడదని, అప్పుడే పారదర్శక రాజకీయం సాధ్యమని బలంగా నమ్మారు. పార్టీ పెట్టిన మొదట్లో పోటీ చేయనని, పొత్తులో మద్దతు మాత్రమే అన్నారు. 2019కి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు. ఫలితాలు చూస్తే ఘోర పరాజయం. స్వయంగా ఆయనే పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమిని చూసిన ప్రత్యర్థులు ఇక పవన్ కళ్యాణ్ పార్టీని మూసేసి ఏదో ఒక పెద్ద పార్టీలో కలిపేసి ఇంటికి వెళతారని ఎద్దేవా చేశారు. కానీ గెలుపు ఓటములకు అతీతమైన వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ అంత దారుణమైన పరాజయాన్ని చిరునవ్వుతో స్వీకరించారు.
అయితే అభిమానులు మాత్రం ఆ పరాభవన్ని తట్టుకోలేక తల్లడిల్లారు. అన్నీ వదిలి మనం కోసం వచ్చిన వ్యక్తికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం అంటూ ఆవేశానికి లోనయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓటమిని భరించే శక్తి లేనప్పుడు గెలుపును కోరుకునే అర్హత ఉండదు అంటూ ధైర్యం చెప్పారు. గెలిస్తే న్యాయం చేస్తాము అన్నాం. కానీ ఓడిపోయాం. ఇప్పుడు చేయాల్సింది సేవ అంటూ జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. నాయకుడి నిస్వార్థమైన తత్వం చూశాక కార్యకర్తల్లో కొండంత బలం పుంజుకుంది. ఆలస్యం చేయకుండా కార్యరంగంలోకి దూకారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యారు. శక్తకి మించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, కార్మికులను సొంత ఊళ్ళకు చేర్చడం, విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తీసుకురావడం, ఆసుపత్రులకు ఆక్సీజన్ సిలీండర్ల పంపిణీ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన గళం విప్పిన ప్రజాసమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నిటికి ప్రభుత్వం పరిష్కారం చూపేలా చేశారు. ఇంకా అనేక సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. ఈ యేడాదిలో సమస్య ఉంటే పరిష్కారం కోసం జనం జనసేన పార్టీని గుర్తుచేసుకునేలా పార్టీని, జనసేనను నడిపారు పవన్ కళ్యాణ్. ఈ నిస్వార్థ నాయకత్వమే ఆయన్ను కార్యకర్తలు ఇకపై మన నాయకుడు ‘పవర్ స్టార్’ కాదు ‘సేనాని.. జనసేనాని’ అని పిలుచుకునేలా చేసింది.