నియోజకవర్గాన్ని మార్చేసే ఆలోచనల్లో జనసేనాని.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. వచ్చే ఎన్నికల నాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త నియోజవర్గాన్ని ఎంచుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తారట. గతంలో రెండు సార్లు పోటీ.. అనడం వల్ల, రెండు చోట్లా ఓటర్లు పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకున్నారన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్, ఏదో ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

అయితే, భీమవరం కాకుండా.. గాజువాక కాకుండా.. కొత్త నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకోవచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఈ రెండు చోట్లో ఏదో ఒక చోట నుంచి పవన్ పోటీ చేస్తారని అంటున్నారు. రాయలసీమలో తిరుపతి ప్రధానంగా వినిపిస్తోన్న పేరు జనసేన శ్రేణుల్లో. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు. పాలకొల్లలోనూ ఆయన పోటీ చేసినా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. కేవలం చిరంజీవి సూచనతోనే పవన్, తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సినిమా ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో, ఉత్తరాంధ్ర వైపు ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలూ లేకపోలేదు. ఆ ఉద్దేశ్యంతోనే గాజువాకలో పోటీ చేసిన పవన్, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన దరిమిలా, ఈసారి పవన్ ఆలోచనలు ఎలా వుంటాయో మరి. అయితే, ప్రస్తుతానికి పవన్ ఎక్కడ పోటీ చేస్తారన్నది అప్రస్తుతం.. అన్నది జనసేన శ్రేణుల వాదన.