జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆయన ‘హోం క్వారంటైన్’లోనే వున్నారు.. తన వ్యక్తిగత సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డంతో, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో పర్యటించిన జనసేనాని, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత తన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ‘హోం క్వారంటైన్’లోకి వెళ్ళిపోయారు. ‘హోం క్వారంటైన్’లో వుంటూనే కరోనా టెస్ట్ చేయించుకోగా తొలుత నెగెటివ్ వచ్చింది. అయినాగానీ, జ్వరం రావడం, తగ్గకపోవడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో, ఆయనకు ప్రత్యేకంగా వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే పవన్ కళ్యాణ్ వైద్య చికిత్స పొందుతున్నారు. అపోలో ఆసుపత్రి వైద్యులతోపాటు, పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన డాక్టర్ సుమన్ వైద్య సేవలు జనసేన అధినేతకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిన నేపథ్యంలో యాంటీ వైరల్ మందులు ఇస్తున్నారనీ, అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోపక్క, తన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందనీ, త్వరలోనే పూర్తిగా కోలుకుని అభిమానులు, ప్రజల ముందుకొస్తాననీ జనసేన అధినేత చెప్పినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా వుంటే, ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించిన నటి నివేదా థామస్ తొలుత కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే. నివేదా థామస్ కరోనా నుంచి కోలుకోగా, దిల్ రాజు ‘హోం క్వారంటైన్’లో వున్నారు. బండ్ల గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.