విశాఖ ఉక్కుపై జనసేనాని పవన్ ‘తుక్క’ రాజకీయం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనబోతున్నారట. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నుంచి అందిన ఆహ్వానం మేరకు విశాఖకు వెళ్ళనున్న పవన్ కళ్యాణ్, కార్మిక సంఘాల నేతలతో చర్చిస్తారు.. ఓ సభలో మాట్లాడతారు కూడా.

నిజానికి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే నినదించారు. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దని కూడా కోరారు. బీజేపీ ఎటూ జనసేన మిత్రపక్షమే గనుక, జనసేన చెప్పిన విషయాలపై బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందని అంతా అనుకున్నారు.

కానీ, జనసేన సూచనల్ని బీజేపీ లైట్ తీసుకుంది. కేంద్రంలోని మోడీ సర్కారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే కాదు, ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులేస్తోంది కూడా. ‘కుదిరితే అమ్మేస్తాం.. లేకపోతే మూసేస్తాం..’ అంటూ కేంద్రం స్పష్టమైన ప్రకటనలూ చేస్తోంది.

మరి, ఈ పరిస్థితుల్లో జనసేన ఏం చేయాలి.? విశాఖ ఉక్కుకి మద్దతుగా రాజకీయ పోరాటం చేయాలి. రాష్ట్రంలో అలాగే ఢిల్లీలో ఆందోళనలు చేయాలి. కానీ, మిత్రపక్షం బీజేపీ ఆగ్రహానికి గురికాకుండా వుండేందుకు సైలెంటయిపోయింది జనసేన.

‘నన్ను గాజువాకలో గెలిపించి వుంటే, ఇంకా గట్టిగా విశాఖ ఉక్కుపై పోరాటం చేయడానికి అవకాశం వుండేది..’ అని ఆ మధ్య పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారానికి కారణమయ్యాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడినా, ప్రజల్లో వుండగలిగితే.. ప్రజల మెప్పు పొంది, ఇంకోసారైనా గెలిచే అవకాశం వుంటుంది.

నిజానికి విశాఖ ఉక్కు వ్యవహారం జనసేనానికి అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో పవన్ పాసైతే, రాజకీయంగా మంచి భవిష్యత్తు వుంటుంది. కానీ, ఇలా తుక్కు పోరాటాలు చేస్తే, రాజకీయంగా పరిస్థితి మరింత దిగజారిపోతుందంతే.