Pawan Kalyan : రాజకీయాల్లో సంయమనం అవసరం. వ్యూహాలు అవసరం. కానీ, ఇవేవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో కనిపించడంలేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, అధికార పీఠమెక్కుదామనుకున్నా.. అది సాధ్యపడలేదు. కానీ, జనసేన పార్టీతో పోల్చితే ప్రజారాజ్యం పార్టీ ఎన్నో వేల రెట్లు బెటర్.
నిజానికి, చిరంజీవి కంటే హార్డ్‌కోర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కే ఎక్కువగా వున్నారు. కానీ, ఏం లాభం.? అభిమానుల్ని ఓటు బ్యాంకుగా పవన్ కళ్యాణ్ మలచుకోలేకపోతున్నారు. చిరంజీవిని కాస్తో కూస్తో నాయకుడిలా చూసిన జనం, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు అలా చూడలేకపోతున్నారు.? అన్న చర్చ ప్రతిసారీ తెరపైకొస్తోందంటే, ఎక్కడ లోపం జరుగుతోందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తెరగాలి.
నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు.. అంటూ భారీ బహిరంగ సభని జనసేనాని నిర్వహిస్తే, అదేదో సినిమా ఈవెంట్.. అన్నట్టు అభిమానుల హంగామా కనిపించింది.
సరే, పవన్ కళ్యాణ్‌కి వున్న సినిమాటిక్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి బహిరంగ సభలు, ర్యాలీల సందర్భంలో పవన్ కళ్యాణ్‌కి వస్తున్న ఫాలోయింగ్, ఎన్నికలొచ్చేసరికి ఓటు బ్యాంకుగా మారడంలేదు.
ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల్ని బహిరంగ సభ వేదికపై చించి పారేయడం వల్ల ఒరిగేదేంటి.? గొంతు చించుకుని రాజకీయ ప్రసంగాలు చేసి ఉపయోగమేంటి.? వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుని, అభిమానుల్ని పూర్తిస్థాయి ఓటు బ్యాంకుగా మలచుకుంటే తప్ప, జనసేన మనుగడ అసాధ్యం.