AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం… జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం పై జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. ఉద్దేశపూర్వకంగానే మిధున్ రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేస్తుండగా అక్రమ కేసులు కాదని తప్పు చేసినవారికి శిక్ష తప్పదని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ మరోవైపు కూటమినేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఈ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు అంటూ ఇప్పటికే ఎంతోమంది కూటమి నేతలు మంత్రులు, జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం జగన్ అరెస్ట్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ… ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేసిన ఆయన, ఇందులో ఎంతటివారైనా వదిలేది లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఈయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ రెడ్డి ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు తదుపరి కోర్టులో హాజరుపరచగా తనకు బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసులో భాగంగా మిథున్ రెడ్డి ఏ 4 నిందితుడుగా ఉన్నారు. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో సిట్ అధికారులు ఈయన నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు తదుపరి ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనే విషయాలపై సర్వత్ర ఆసక్తి నెలకొనడమే కాకుండా ఈ స్కాంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.