సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా వేడుకలపై రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరమేముంది.? పవన్ కళ్యాణ్ నేరుగా జనంలోకి వెళ్ళి, ఓ బహిరంగ సభ పెట్టి రాజకీయ విమర్శలు చేయొచ్చుగాక. సినీ పరిశ్రమకు జగన్ సర్కార్ నష్టం చేస్తోందనే భావన వుంటే, ఆ విషయాన్ని.. పార్టీ వేదిక మీద నుంచి గట్టిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించొచ్చు. కానీ, ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు.. వైఎస్ జగన్ సర్కార్ మీద దుమ్మెత్తిపోశారు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ, వైఎస్ జగన్ సర్కారు.. సినీ పరిశ్రమకు కలిగిస్తోన్న నష్టంపై నిలదీయాలని కోరారు. కానీ, సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి కొందరు సినీ ప్రముఖుల నుంచి ఇప్పటికే జగన్ సర్కారుకి మద్దతు లభించింది. మరోపక్క, ఏపీలోనూ సినిమాలు విడుదలవుతున్నాయి.. అక్కడ కరోనా కేసుల తీవ్రత కాస్త ఎక్కువగా వుండడంతో, కొన్ని ఆంక్షల నడుమ థియేటర్లు రన్ అవుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్‌కి అర్థమవుతోందా.? లేదా.? అన్నది ఇంకో చర్చ.
నిజమే, ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో జగన్ సర్కార్, ఆ సినిమాకి ఇబ్బందులు కలిగించింది. అది రాజకీయ పరమైన కోణంలోనే జరిగింది. ఆ అంశంపై అప్పుడు పెదవి విప్పని పవన్ కళ్యాణ్, తన సమస్యని.. పరిశ్రమ సమస్యగా చూపించి, సింపతీ కొట్టేయాలనో.. తానే నాయకుడినని నిరూపించుకోవాలనో ‘రిపబ్లిక్’ సినిమా వేడుక సాక్షిగా హంగామా చేసినట్టున్నారన్నది ఇంకో వాదన. ఎవరి గోల వారిదే. అయినా, మంత్రిని పట్టుకుని ‘సన్నాసీ..’ అనడం ఎంతవరకు సబబు.? ఎంతవరకు హుందాతనం.? రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయ్.. మార్పు కోసం చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, మరింతగా రాజకీయాల్ని దిగజార్చేసేలా వ్యవహరించడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. పవన్ కళ్యాణ్ విమర్శలకు ఎటూ వైసీపీ నుంచి ఘాటైన సమాధానమే వస్తుంది. ఇక, పవన్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించకపోతే, జగన్ సర్కారు నిర్ణయాల్ని తెలుగు సినీ పరిశ్రమ సమర్థించినట్లే బావించాల్సి వస్తుందేమో.