పవన్ కళ్యాణ్ వివాదానికి మెగాస్టార్ చిరంజీవి ఫినిషింగ్ టచ్ ఇచ్చారని అనుకోవాలా.? నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో సమావేశమవడం వెనుక మెగాస్టార్ చిరంజీవి కీలక భూమిక పోషించారా.? అంటే, అవుననే చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ‘పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దు. సినీ పరిశ్రమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించండి..’ అంటూ పేర్ని నానికి చిరంజీవి విజ్ఞప్తి చేశారట. ఈ విషయాన్ని పేర్ని నాని స్వయంగా వెల్లడించారు. అయితే, పేర్ని నాని మాటల్లో కొంత ఆందోళన కన్పించింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుగా ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. నిన్న మొన్నటిదాకా వైసీపీ నేతలు, సినీ పరిశ్రమ గురించి మాట్లాడిన మాటలకీ, ఇప్పుడు పేర్ని నాని చెప్పిన విషయాలకీ స్పష్టమైన తేడా వుంది.
పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పేర్ని నాని స్వయంగా చెప్పుకొచ్చారు. అవి దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం వివరించిన అంశాలే కావొచ్చు. అంతకు ముందు చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలే కావొచ్చు. కానీ, అప్పట్లో సానుకూలంగా స్పందించని ప్రభుత్వం ఇప్పుడెందుకు ఇంత సానుకూలంగా స్పందిస్తోంది.? ఇంత వివాదం నడిచాక, సినీ పరిశ్రమలో కూడా ఈ అంశాల గురించి లోతైన చర్చ జరిగి వుండొచ్చనీ, పరిశ్రమలో నెలకొన్న అలజడి గురించి ఆరా తీసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేయడానికి సిద్ధమై వుండొచ్చనీ సినీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ అలజడి సృష్టించారనే వాదనా లేకపోలేదు.