Pawan Kalyan Is Unstoppable : రాజకీయాల సంగతెలా వున్నా, సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. అదిగో ఆ దర్శకుడితో సినిమా, ఇదిగో ఈ బ్యానర్‌లో సినిమా.. అంటూ పవన్ కళ్యాణ్ గురించి నిత్యం బోల్డన్ని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు మానేస్తానని ప్రకటించాక పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమా ‘వకీల్ సాబ్’. దాన్ని పూర్తి చేయడానికి పవన్ ఎంత కష్టపడాల్సి వచ్చిందో, పవన్‌తో సినిమా నిర్మించేందుకు నిర్మాతలెంత కష్టపడ్డారో, టెక్నీషియన్లు, సహనటులు వీళ్ళ వ్యవహారాలేంటో.. సినీ పరిశ్రమలో కథలు కథలుగా చర్చించుకుంటూనే వున్నారు.
అంతలా రాజకీయాల వల్ల ఆ సినిమాకి ఇబ్బందులు ఎదురయ్యాయ్. ఎలాగోలా అది రిలీజయ్యింది.. ఆ తర్వాత ‘భీమ్లానాయక్’ కూడా పట్టాలెక్కేసింది. సందట్లో సడేమియా, ‘హరిహర వీరమల్లు’ కూడా నిర్మాణం జరుపుకుంటూనే వుంది. ఇంతేనా.? కథ చాలా వుంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా పట్టాలెక్కాలి. లిస్టు రాసుకుంటూ పోతే, పది సినిమాల వరకూ ప్రచారంలో వున్నాయి. వీటిల్లో సగానికి పైగానే ఖాయమైపోయిన ప్రాజెక్టులు.
లెక్క అప్పుడే అయిపోలేదు, మరో ఐదారు సినిమాల గురించిన హంగామా కూడా నడుస్తోంది. నిజానికి, పవన్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తారు. అది కెరీర్ మొదటి నుంచీ ఆయన అనుసరిస్తున్న వైఖరే. ఇప్పుడు రాజకీయాల కారణంగా ఇంకా ఇబ్బంది వచ్చిపడింది. 2024 తర్వాత కూడా పవన్ ఇంకో ఐదేళ్ళపాటు సినిమాలు చేసేలా లైనప్ వుంది మరి.