రామాయణంలో పిడకల వేట అంటే ఇదే మరి.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసాన్ని ఖండించేశారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేశారు కూడా. మృతుడి ఆత్మకు శాంతి కలగాలనీ అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రెస్ నోట్ వచ్చింది.
నిజానికి, ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా చెయ్యాల్సింది ఇదే. తప్పు ఎక్కడ జిరిగినా ఖండించాల్సిందే. మరి, మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి.? తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ఈ వివాదంపై స్పందించింది. కాంగ్రస్, బీజేపీ, మజ్లిస్.. ఇలా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తూనే వున్నారు.
అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కేవలం స్పందిస్తే సరిపోదు, ఖండిస్తే సరిపోదు. అగ్నిపథ్ వివాదంపై కేంద్రాన్ని నిలదీయాలి. కానీ, నిలదీయలేరాయన. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి జనసేన పార్టీ మిత్రపక్షం.
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఏమీ వున్నట్లు కనిపించడంలేదు.
ఆ మాటకొస్తే, ఇరు పార్టీల మధ్యా గ్యాప్ చాలా ఎక్కువగా వుంది తెలంగాణలో. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, బాధ్యతగల పౌరుడిగా స్పందించి ఊరుకున్నారని అనుకోవాలేమో. అంతకు మించి, ఆయన బీజేపీని చిత్తశుద్ధితో విమర్శించడమో, స్నేహభావంతో సమర్థించడమో చేయలేదు.
అమలాపురం అల్లర్ల విషయంలో ఘాటుగా స్పందించి, ఇప్పుడెందుకిలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్న విమర్శ జనసేనానిపై సహజంగానే వస్తుందనుకోండి.. అది వేరే సంగతి.