చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్, ఇలాగైతే పవర్ దక్కేదెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక విషయమై చేతులెత్తేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య స్వయంగా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న దరిమిలా, నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న జనసేన పార్టీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటోందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

నిజానికి, ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది. గతంలో ఇలా చాలా ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి కూడా. వాస్తవానికి, అధికార వైసీపీ.. తమ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి నేపథ్యంలో, విపక్షాలకు ఏకగ్రీవం విషయమై ఒప్పించి వుండాల్సింది. అలా చేయడం ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఘనంగా నివాళులర్పించినట్లయ్యేది. సరే, ఇప్పుడు రాజకీయాలెలా వున్నాయ్. రాజకీయాలు మారిపోయాయ్.

ఆ సంగతి పక్కన పెడితే, జనసేన అధినేత నిర్ణయం, మిత్రపక్షం బీజేపీకి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. ‘మేమైతే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం.. మిమ్మల్ని మాత్రం మేం ఆపదలచుకోవట్లేదు..’ అన్నట్లుగా బీజేపీ కోర్టులోకి బంతిని తెలివిగా జనసేన నెట్టేసింది. ఇప్పుడిక బీజేపీ ఏం చేస్తుంది.? జనసేనను వెంటేసుకుని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ ఏమీ సాధించలేకపోయింది.

బద్వేలు విషయంలో బీజేపీ ఒంటరిగా వెళితే, ఆ పార్టీ మరింతగా దిగజారిపోతుంది.. ఇదే విషయమై బీజేపీలో చర్చ హాటు హాటుగా జరుగుతోందట. బీజేపీ సంగతి పక్కన పెడితే, జనసేన అధినేత ఎందుకిలా చేశారు.? రాజకీయాల్లో ‘పవర్’ ముఖ్యం. పవర్ అంటే అధికారం అని. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం విషయంలో బీజేపీకి తలొగ్గేశారు జనసేనాని. ఇప్పుడేమో పూర్తిగా చేతులెత్తేశారు. ఇలాగైతే, పవర్ వచ్చేదెప్పుడు.? గట్టిగా నిలబడి, బద్వేలు ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబడితే.. గెలిచినా, గెలవకున్నా.. గట్టి పోటీ ఇచ్చినట్లయ్యేది.

ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ రాజకీయం.. జనసేన శ్రేణులకు మింగుడపడని విధంగా తయారైంది. బద్వేలు విషయమై జనసైనికుల్లో నిన్న మొన్నటిదాకా చాలా ఉత్సాహం కనిపించింది. అదంతా ఇప్పుడు నీరుగారిపోయింది.