Pavala Shyamala: సహాయం కోసం వెళ్తే గెంటేశారు.. మరింత దీనస్థితిలో పావలా శ్యామల!

Pavala Shyamala: ఒకప్పటి లేడీ కమెడియన్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది పావలా శ్యామల. ముఖ్యంగా తనదైన శైలిలో కామెడీ చేస్తూ లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతోపేక్షకులకు కూడా బాగా చేరువ అయింది. ముఖ్యంగా గోపీచంద్ హీరోగా నటించిన గోలీమార్ సినిమాలో శ్యామల పండించిన కామెడీని ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరని చెప్పాలి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నటిగా కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

దానికి తోడు వృద్ధాప్య వయసులో ఉండడంతో మరింత తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. వీటికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఆమెను వెంటాడుతున్నాయి. అయితే ఇప్పటికే పావలా శ్యామల పరిస్థితిని చూడలేక చాలామంది సినిమా హీరోలు నటీనటులు సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం గురించి స్వయంగా అవి చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పావలా శ్యామల మాట్లాడుతూ.. నేను నటిగా కొనసాగుతున్న సమయంలో వచ్చిన డబ్బు మొత్తం నా కుమార్తె అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించడానికి ఖర్చు చేశాను. ప్రస్తుతం నా వయసు పైబడింది నేను సినిమాలలో నటించే పరిస్థితిలో కూడా లేను. సంపాదించిన డబ్బు మొత్తం వైద్యం కోసమే ఖర్చు చేశాము. ప్రస్తుతం నేను నా కూతురు అనాథల్లాగా బతుకుతున్నాము. నా ఈ పరిస్థితి చూసి చాలామంది హీరోలు సహాయం చేశారు. చిరంజీవి కూడా నాకు లక్షల్లో సహాయం చేసి ఆదుకున్నారు.

అంతేకాదు గతంలో లక్ష రూపాయలు వెచ్చించి మా లో మెంబర్‌షిప్‌ ను చిరంజీవి ఇప్పించారు. అలాగే నా కూతురి ఆరోగ్యం గురించి తెలుసుకుని మరో రెండు లక్షల ఆర్థిక సాయం చేశారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూడా ఆ పెన్షన్ తోనే బ్రతుకుతున్నాము. దిల్ రాజు కూడా నా పరిస్థితి చూసి సహాయం చేస్తామని అన్నారు. మా మేనేజర్ మీతో మాట్లాడతారని చెప్పారు. కానీ ఇప్పటివరకు దిల్ రాజు గారి నుంచి నాకు ఎలాంటి సహాయం అందలేదు. అలాగే సాయం కోసం కొందరు స్టార్ హీరోల ఇంటికి వెళ్లాను. కానీ అక్కడ భాష రాని హిందీ వాచ్ మెన్లు నన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. నాకు ఏదైనా అయితే నా కూతురు ఒంటరిగా మిగిలిపోతుందని బాధగా ఉంది. అందుకే ఇలాంటి బాధలు పడే కంటే నేను నా కూతురు చనిపోతే బాగుండు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పావలా శ్యామల. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కొంతమంది ఆమె పరిస్థితి చూచి దయతలిచి చాలామంది సినిమా హీరోలు స్పందించి ఆర్థికంగా సహాయం చేస్తే మేలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.