తెలంగాణ పీసీసీకి మతిమరుపు వ్యాధి

తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై ఏఐసీసీ పెద్దలు సీరియస్ అయ్యారు. చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదని మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యం ఏంటని క్లాస్ పీకిందంటా పార్టీ అధిష్టానం. హైకమాండ్ ఏదన్నా చెబితే రాష్ట్ర నాయకత్వం ఈ మధ్య సీరియస్ గా తీసుకోవడం లేదంటా. ఇక విషయంలోకి వెళ్తే….ఎన్డీయే సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చిన్నసన్నకారు రైతులు నష్టపోతారని యూపీఏ భాగస్వామ్య పక్షాలు కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాయి. కేంద్ర తీరుకు నిరసగా ప్రజా పోరాటానికి పిలుపును కూడా ఇచ్చాయి. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ నెల ముగిసేనాటికల్లా కిసాన్ మజ్దూర్ పేరుతో 2 కోట్ల సంతకాలను సేకరించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా 12 లక్షల సంతకాలు సేకరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆదేశించింది పార్టీ హైకమాండ్.


అయితే దుబ్బాక ఉపఎన్నిక హడావిడిలో పడ్డ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఈసంతకాల సేకరణ విషయాన్నే మర్చిపోయారంటా. సంతకాల సేకరణను లైట్ తీసుకున్నారంటా. డెడ్ లైన్ దగ్గర పడేసరికి వాకబు చేసిన హైకమాండ్ పెద్దలు విషయం తెలుసుకొని అగ్గిమీద గుగ్గిలం అయ్యారంటా. అప్పగించిన ఏ ఒక్క పని పూర్తి చేయడం లేదని మండిపడ్డారంటా హైకమాండ్ పెద్దలు.