భారత క్రికెట్ అభిమామనులకు మరో షాక్. కొద్ది నెలల క్రితం మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని, డాషింగ్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఈ విషయం అభిమానులకి జీర్ణించుకోవడానికి చాలా కష్టంగానే మారింది. ఇక ఇప్పుడు టీమిండియా వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ అన్ని ఫార్మాట్ల నుండి తాను తప్పుకున్నట్టు ప్రకటించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్ అప్పట్లో రికార్డు సృష్టించాడు.
35 ఏళ్ల పార్థివ్ భారత్ తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ తరఫున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మొదట్లో అద్భుత ప్రతిభ కనబరచిన పార్ధీవ్ తర్వాత తర్వాత చాలా డల్ అయ్యాడు. దినేష్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ రాకతో క్రమంగా టీమ్‌లో స్థానం కోల్పోయాడు.2004లో తొలిసారి టీమ్‌లో స్థానం కోల్పోయిన పార్థివ్ మధ్య మధ్యలో అవకాశం వచ్చినప్పటికీ వినియోగించుకోలేకపోయాడు.ఈ 18 ఏళ్ళు తనకు సహకరించిన బీసీసీఐ, అందరు కెప్టెన్లకు కృతజ్ఞతలు చెబుతూ.. ట్విటర్‌లో ఓ లేఖను పోస్ట్ చేశాడు.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్ టీమ్ ల తరఫున ఆడిన పార్దీవ్ ఇందులో పెద్దగా రికార్డులేమి నమోదు చేయలేదు. తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. కొన్ని సార్లు తన మెరుపు స్టంపింగ్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన పార్ధివ్ ఇలా సడెన్‌గా వీడ్కోలు పలకడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.