చంద్రబాబు – జగన్ ల ని మించి ఏపీ లో అతిపెద్ద పాదయాత్ర ??

 

దివంగత నేత పరిటాల రవి అంటే తెలియని వారు లేరు.. ఇక ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా మారింది.. కాగా అనంతపురం జిల్లాలో చాలా వరకు టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న జేసీ కుటుంబం తో పాటుగా, పరిటాల కుటుంబం కూడా కీలకమే. ఇకపోతే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా అనంతపురం జిల్లాలో ముందుకు నడిపించిన పరిటాల కుటుంబం గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తోంది.. అదీగాక ఆ రాష్ట్ర ప్రభుత్వం వినుకొండలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా పరిటాల రవీంద్ర విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే..

ఈ విషయంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక లేఖ విడుదల చేయడం మినహా పరిటాల కుటుంబం పెద్దగా స్పందించలేదు.. కానీ తెరవెనక పరిటాల శ్రీరామ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అధికార పార్టీ చర్యల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రాప్తాడు నియోజకవర్గం నుంచి వినుకొండ నియోజకవర్గం వరకు పాదయాత్రగా వచ్చి, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలి అని పరిటాల శ్రీరామ్ భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రణాళికలో భాగంగా పరిటాల కుటుంబంతో పాటుగా, స్థానిక నాయకత్వంతో కూడా పరిటాల శ్రీరామ్ చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.. కాగా ఇది వరకే పరిటాల సునీత పార్టీ అధిష్టానానికి, తామూ చేపట్టబోయే పాదయాత్ర కు సంబంధించిన విషయాన్ని చేరవేసినట్లుగా తెలుస్తోంది.. దీనికి చంద్రబాబునాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలో నే ఈ పాదయాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని, ఏపీ లో పరిటాల శ్రీ రాం చేస్తున్న ఈ పాద యాత్ర చంద్రబాబు, జగన్ లు ఇదివరకు చేసిన దానికంటే అతిపెద్ద పాదయాత్ర అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా త్వరలో జరగబోయే ఈ పాదయాత్ర ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి..