గోపీచంద్, మారుతిల ‘పక్కా కమర్షియల్’ మూవీ ఎలావుందంటే ..?

చిత్రం : పక్కా కమర్షియల్

రేటింగ్ : 2.75/5

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి

నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్,
ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాత: ‘బన్నీ’ వాసు

సినిమాటోగ్రఫీ: క‌ర్మ్‌ చావ్లా

సంగీతం: జేక్స్ బిజాయ్

దర్శకుడు మారుతి ఓ సినిమాను తెరకెక్కించాడంటే.. మినిమమ్ గ్యారెంటీ ఉంటుందని, హాయిగా నవ్వుకుని రావొచ్చని సగటు సినీ ప్రేక్షకుడు అనుకోవడం సహజం. ‘ప్రతిరోజు పండ‌గే’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత మారుతి చేసిన సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ క‌లిసి, బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కిన సినిమా ఇది. మాస్ ఇమేజ్‌తో కమర్షియల్ పంథాలో వెళ్తున్న గోపీచంద్‌కి గత కొన్నేళ్లుగా కమర్షియల్ హిట్ లేకపోవడంతో.. మారుతితో కలిసి ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ తాజాగా నటించిన ‘పక్కా కమర్షియల్’ నేడు (జూలై 1, 2022)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందు వచ్చిన టీజర్స్, ట్రైలర్స్‌ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకుల్నిఎలా ఆకట్టుకుంటోంది.. అసలు కథేంటీ.. తదితర విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ:

ఓ అమ్మాయికి న్యాయం చేయలేకపోయానని న్యాయమూర్తిగా తన వృత్తిని వదిలేస్తాడు సూర్య నారాయణ (సత్య రాజ్). డబ్బున్న వారికే న్యాయం అందుతోందంటూ వివేక్ (రావు రమేష్) కేసులో జరిగింది న్యాయం కాదు.. అన్యాయం అని తలుచుకుంటూ సూర్య నారాయణ కుమిలిపోతుంటాడు. తాను చేసిన తప్పు తన కొడుకు లక్కీ (గోపీచంద్) ద్వారా సరిదిద్దుకోవాలని భావించి అతనిని లాయర్ చదివిస్తాడు. న్యాయం చేయలేకపోయానే అని వృత్తిని వదిలేసిన తండ్రికి.. న్యాయాన్ని అమ్మకం పెట్టే కొడుకుగా లక్కీ తయారవుతాడు. అన్యాయం జరిగిన వారి వైపు నిలబడి లాభాపేక్ష లేకుండా కేసులు వాదించమని చిన్నప్పటి నుంచి అతనికి నూరిపోస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తండ్రి ముందు అందరి దగ్గర న్యాయంగా ఉన్నట్లు నటిస్తూనే పక్కా కమర్షియల్ లాయర్ గా మారతాడు. దానికి తోడు ఎవరి వల్ల తన తండ్రి అయితే జడ్జి పదవికి రాజీనామా చేసి సామాన్య జీవితం గడుపుతున్నాడో అతనికోసమే కొన్ని తప్పుడు కేసులు వాదిస్తూ ఉండడంతో సూర్యనారాయణ మళ్లీ లాయర్ కోటు వేసుకునేందుకు సిద్ధమవుతాడు. అలా తండ్రీ కొడుకుల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? మధ్య లాయర్ ఝాన్సీ రాణి(రాశిఖన్నా) పాత్ర ఏమిటి? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? తండ్రా, లేక కొడుకా? నాన్ కమర్షియల్ తండ్రి కొడుకుని ఓడించడం కోసం ఏం చేశాడు? పక్కా కమర్షియల్ కొడుకు తండ్రిని ఓడించడం కోసం ఏం చేశాడనేది ఆసక్తికరమైన మిగతా కథ.

విశ్లేషణ :

ఈ చిత్రాన్ని పక్కా మారుతీ మార్క్ సినిమాగా చెప్పొచ్చు. రొటీన్ కథే అయినా తనదైన శైలిలో కథను నడిపించి ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు మారుతి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా డైలాగులు రాయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారాన్ని ఒక సరదా సంభాషణగా సాగిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. సీరియస్ పాయింట్ అయినా సరదాగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే చక్కటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. న్యాయం కోసం నిలబడే జడ్జి, డబ్బుతో ఏమైనా చేయగలను అనుకునే నేటి సమాజపు మోడరన్ క్రిమినల్ మధ్య కథగా ఉండబోతుందనే విషయం సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే కథ కాస్త రొటీన్ గా ఉండడంతో జరగబోయే సన్నివేశాలు ఏమిటి అనే విషయం మీద ప్రేక్షకులు ఈజీగా ఒక క్లారిటీకి వచ్చేస్తారు. నిజాయితీగల జడ్జిగా పనిచేసి దానికి దూరమై కిరణా షాప్ పెట్టుకొని పేదలకు సేవ చేస్తూ కాలం వెళ్ళదీయాలని భావించే సూర్యనారాయణ తన కొడుకు తనను మాయ చేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా కొడుకు నిజస్వరూపం తెలుసుకోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. అన్యాయానికి అండగా నిలబడుతున్న కొడుకు మీదే ధర్మ యుద్ధం ప్రకటిస్తాడు సూర్యనారాయణ. సినిమా రెండో భాగం ప్రారంభమైనప్పటినుంచి తండ్రీ కొడుకుల మధ్య పోరు ఆసక్తికరంగా మారుతుంది. తండ్రి కోసం కొడుకు ఇలా కూడా చేయవచ్చా అనే విధంగా దర్శకుడు మారుతి రెండో భాగాన్ని డిజైన్ చేశాడు. కొడుకు ఆలోచనలను ముందుగానే పసిగట్టి అతడి ఆలోచనలను తండ్రి చిత్తు చేయడం, తండ్రి ఆలోచనలను కొడుకు పసిగట్టి కౌంటర్ ఇవ్వడం వంటి ఆసక్తికరమైన కథనంతో రెండో భాగం సాగుతుంది. ఎప్పటికప్పుడు తండ్రి మీద గెలవాలనుకునే కొడుకు చివరికి తండ్రికి ఎలా సాయం చేసి తండ్రిని గెలిపించాడు అనే పాయింట్ మాత్రం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. పక్కా కమర్షియల్ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే మారుతి కమర్షియల్ అంశాలను ఎక్కడా కూడా మిస్ కానివ్వలేదు. ఎక్కడ జనాలు కౌంటర్లు వేస్తారో అనుకుని ముందుగానే. ఆ కౌంటర్లను సినిమాలోనే పెట్టేసుకున్నాడు మారుతి. అయితే అతడు రాసుకున్న కామెడీ ట్రాక్‌కు జనాలు థియేటర్లో పగలబడి నవ్వాల్సిందే. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా రాశాడు. మారుతి రాసుకున్న కోర్టు సీన్లు చూస్తే మాత్రం కచ్చితంగా నవ్వొస్తుంది.

నటీనటుల విషయానికొస్తే… హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. పూర్తిస్థాయి స్టైలిష్ లాయర్ గా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఈ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా చాలా స్టైలిష్ గా కనిపించి ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తనదైన డైలాగ్ డెలివరీతో కామెడీ టైమింగ్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. శ్రీనివాసరెడ్డి, వైవాహర్ష, సప్తగిరి, చమ్మక్ చంద్ర, వేణు వంటి వారితో ఎక్కడికక్కడ పోటాపోటీగా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. డబ్బుల్లేనిదే ఏ పని చేయను, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో గోపీచంద్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించాడు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా అందరినీ నవ్విస్తుంది. తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఆ భ్రమలోనే బతికే పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. గ్లామర్ పరంగానే కాకుండా తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. ఆమె పాత్ర డిజైన్ చేసిన విధానమే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒక సీరియల్ ఆర్టిస్ట్ కావడంతో ఆ పాత్రకు తగినట్లు ఆమె నటించారు కానీ పాత్ర డిజైన్ చేయడమే కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. గోపీచంద్ తండ్రి పాత్ర అయిన సూర్యనారాయణ అనే జడ్జి పాత్రలో నటించిన సత్యరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి తన సహజ ధోరణీలో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక రావు రమేష్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రావు రమేష్, అజయ్ ఘోష్ ల నటన సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నటించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, వేణు, సప్తగిరి, వైవాహర్ష, ప్రవీణ్ వంటి వారు తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక శుక్లది మరీ చిన్న పాత్ర. చెప్పుకోవడానికేం లేదు. కెరీర్ ఆరంభంలో పలు సినిమాల్లో కథానాయికగా కనిపించిన ఈమె ఇలాంటి క్యారక్టర్ లో కనిపించడం విచిత్రమే!

టెక్నికల్ విషయాలకొస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. క‌ర్మ్‌ చావ్లా కెమెరాలో బంధించిన అందాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. హీరో గోపిచంద్ ను ఎంతో స్టయిలిష్ గా చూపించారు. అలాగే.. ఈ సినిమాకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు జోక్స్ బిజాయ్ తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పాటలు, వాటిని తెరకెక్కించిన విధానం కూడా చాలా బాగుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా బెటర్ గా అనిపించింది.. ‘అందాల రాశి..’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంటుంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. కృష్ణ కాంత్ రాసిన ఈ గీతాన్ని శ్రీ చరణ్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ‘పక్కా కమర్షియల్..’ అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. ఈ పాట క్యాచీ టోన్‌తో అదరగొట్టింది ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. గీతా ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా చేశాయి.

-ఎం.డి. అబ్దుల్