తమ కూటమి సీఎం అభ్యర్థిగా కమలహాసన్ ను అంగీకరిస్తున్నట్టు ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్ తెలిపారు. కూటమి, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని శరత్‌కుమార్ కు అప్పగిస్తూ ఎస్‌ఎంకే కార్యవర్గం బుధవారం తీర్మానించింది. సమత్తువ మక్కల్ కట్చి రాష్ట్ర కార్యవర్గం భేటీ తూత్తుకుడి జిల్లా ద్రవ్యపురంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు, కూటమి ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, వన్నియర్లకు 10.5 శాతం రిజర్వేషన్ల అమలతో ఎదురయ్యే నష్టాలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
శరత్‌కుమార్ మాట్లాడుతూ భావితరాల శ్రేయస్సును కాంక్షిస్తూ, త్యాగాలకు సిద్ధం కావాలని ఎస్‌ఎంకే కేడర్‌కు పిలుపునిచ్చారు. ఓటును నోటుతో కొనేయ వచ్చన్న ధీమాతో కొందరున్నారని, వారి ప్రలోభాలకు లొంగ వద్దు అని సూచించారు. లొంగిన పక్షంలో భావితరాలకు అష్టకష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఈ పాలకులకు ప్రచారాలకు శరత్‌కుమార్ కావాల్సి వచ్చాడని, ఇప్పుడు శరత్‌కుమార్ అంటే ఎవరో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ పాలకులకు గట్టిగా బుద్ధి చెప్పే రీతిలో ఈ ఎన్నికల్లో తన పయనం ఉంటుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించడమే కాదు, అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఐజేకే, మక్కల్ నీది మయ్యం వంటి పార్టీలతో కలిసి కూటమిగా ఎస్‌ఎంకే ముందుకు సాగుతున్నదని ప్రకటించారు. ఈ కూటమి ఖరారైందని, ఈ కూటమి సీఎం అభ్యర్థిగా కమల్‌ను అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రాధికా కూడా పోటీ చేయనున్నారని తెలిపారు.