నటీనటులు: హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ సింహ, సాయి రోనాక్
దర్శకత్వం : అశోక్ తేజ
థియేటర్ లో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి చాలా కష్టాలు ఉంటాయి. ఈ మధ్య ఓటీటీ లు వచ్చాక కేవలం ఓటీటీ ల కోసమే సినిమాలు నిర్మించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక సినిమానే ఓదెల రైల్వేస్టేషన్.
ఓటీటీ సినిమాలకి, థియేటర్ లో సినిమాలకు కొన్ని తేడాలు ఉన్నాయి. ఓటీటీ సినిమాలకి కమర్షియల్ లెక్కలు అవసరం లేదు. సెన్సార్ వుండదు కాబట్టి థియేటర్లో చెప్పడానికి వీలుపడని కంటెంట్ ని కూడా చెప్పొచ్చు. పాయింట్ లో కొత్తదనం వుంటే చాలు. ఆ పాయింట్ చెప్పడానికి పెద్ద స్టార్ కాస్ట్ కూడా అవసరం ఉండదు. ఇలా చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైన ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ వారం ఆహాలో ఒక కొత్త సినిమా వచ్చింది. అదే.. ‘ఓదెల రైల్వేస్టేషన్. సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లే తో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్ నిర్మించిన చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే…
కథ:
అనుదీప్ (సాయి రోనక్) చాలా తెలివైన వాడు. సివిల్స్ లో టాపర్ అయినా కానీ ఐఎఎస్ ఆప్షన్ ని వదులుకొని ఐపీఎస్ ని ఎంచుకుంటాడు. తన జాబ్ ట్రైనింగ్ లో భాగంగా ఓదెల అనే గ్రామానికి వస్తాడు. అదే గ్రామంలో రాధ (హెబ్బా పటేల్) భర్త తిరుపతి (వశిష్ట సింహ) ఇస్త్రీ చేసుకొని జీవితం గడపుతుంటారు. పెళ్లి అయ్యి చాన్నాళ్లు అయినా కానీ పిల్లలు పుట్టకపోవడంతో తిరుపతికి వున్న లైంగిక సమస్యపై డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది రాధ. ఇదే సమయంలో ఓదెలలో ఒక సంచలనమైన కేసు వెలుగు చూస్తుంది. శోభనం జరిగిన మరుసటి రోజే పెళ్లి కూతురిని ఒక సైకో అతి కితారకంగా అత్యాచారం చేసి చంపేస్తుంటాడు. వరుసగా రెండు హత్యలు జరుగుతాయి. ఈ కేసు ను అనుదీప్ ఒక సవాల్ గా తీసుకుంటాడు. మరి ఈ కేసుని అనుదీప్ ఎలా చేధించాడు ? ఇంత దారుణమైన సైకో హత్యలు చేస్తున్న కిల్లర్ ఎవరు ? అసలు శోభనం మరుసటి రోజే అమ్మాయిలని ఎందుకు చంపుతున్నాడు ? అనేది మిగతా కథ.
దర్శకుడు సంపత్ నంది మంచి కథకుడు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు బాగా ఆడలేదు. అయితే ఈ సారి ఈ సినిమాకు కేవలం కథ మాత్రమే అందించాడు. అయితే తొలిసారి ఒక క్రైమ్ థ్రిల్లర్ ని అందించాడు. వాస్తవ సంఘటనలు ఆధారంగా అని టైటిల్స్ లో వేశారు. అయితే ఇలాంటి సైకో కిల్లింగ్ ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పలేదు కానీ సంపత్ నంది ఎంచుకున్న పాయింట్ మాత్రం టెర్రిఫిక్ గా వుంది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ్ కథని సంచలనంగా మొదలుపెట్టాడు. ఒక మహిళ ఒకరి తల నరికి పోలీసు స్టేషన్ లో లొంగిపోతుంది. అ మహిళా ఎవరనేది స్పష్టంగా చుపించలేదు. ఆ మహిళ ఎవరు ? తల ఎవరిదనే క్యురీయాసిటీ ప్రేక్షకుడిలో కలుగుతుంది. మొదటి హత్య జరిగిన తర్వాత సైకో ఎవరని ప్రేక్షకుడు అలోచించడం మొదలుపెడతాడు. ఈ దశలో కొన్ని పాత్రల అనుమానం వచ్చేలా నడిపిన సీన్లు పాతగానే వున్నా.. అసలు సైకో కిల్లర్ ఎవరనే ఎక్సయిట్మెంట్ మాత్రం కలిగించారు.
ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో సైకో ఆడే మైండ్ గేమ్ కూడా చాలా ముఖ్యం. కానీ ఈ మూవీ లో అలాంటి గేమ్ ఏమీ కనిపించదు. థ్రిల్లర్ సినిమాల్లో అసలు సైకో రివిల్ అయినపుడు ప్రేక్షకుడు పొందే థ్రిల్ చాలా ముఖ్యం. ఇందులో మాత్రం ఆ థ్రిల్ మిస్ అయ్యింది. సైకో కిల్లింగ్ కి అతడు ఇచ్చుకున్న కారణం కూడా కన్విన్సింగా ఉండదు.
చాలా థ్రిల్లర్ సినిమాలు చూసిన వాళ్లకు ఈ సినిమా పెద్ద కిక్ ఇవ్వదు. ఎలాగో ఓటీటీలో వుంది కాబట్టి వీలున్నప్పుడు ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా కి పార్ట్ 2 కూడా వుందని చివర్లో హింట్ ఇచ్చారు.