‘లైగర్’ హీరోయిన్ అనన్య ఇంట్లో ‘డ్రగ్స్’ సోదాలు.!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఇది. పూరి జగన్నాథ్, ఛార్మి.. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ‘లైగర్’ సినిమాని నిర్మిస్తున్నారు.

కాగా, అనన్య పాండే ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో తాజాగా సోదాలు నిర్వహించింది. ఇటీవల బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులపై డ్రగ్స్ ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ పలు దఫాలు నార్కోటిక్స్ బ్యూరో, ఈడీ యెదుట విచారణకు హాజరైంది.

ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడంతో, బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలో మరోమారు గట్టిగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమా చేసింది) కూడా డ్రగ్స్ కేసులోనే అరెస్టయ్యింది.

అనన్య పాండే అలాగే షారుక్ ఖాన్ ఇళ్ళలో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు నిర్వహిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. తెలుగునాట డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పూరి జగన్నాథ్, ఛార్మి.. ఇటీవల ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.