టీడీపీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించారు. అచ్చెన్న నియామకంతో పార్టీ తలరాత మారిపోతుందని, చంద్రబాబు సీఎం అయిపోతారని టీడీపీ శ్రేణులు ఆశపడుతున్నాయి. అచ్చెన్నాయుడు కూడ ఇకపై తన కర్తవ్యం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమేనని అన్నారు. కానీ వాస్తవికంగా ఆలోచిస్తే అవన్నీ జరిగే పనులేనా అంటే కాదనే చెప్పాలి. అచ్చెన్న బాబును సీఎం చేయడం తర్వాతి సంగతి అసలు ఏ పదవితో ఆయనకు కొత్తగా పవర్స్ ఏమైనా వస్తాయా అంటే రావని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబ పాలనలో నడిచే పార్టీ. కుటుంబ పాలన కింద ఉండే పార్టీలో ఎప్పటికీ బయటి వ్యక్తులకు అవకాశం ఉండనే ఉండదు.
అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే కావొచ్చు, కీలకమైన బీసీ లీడర్ కావొచ్చు కానీ అవేవీ నడవవు. ఎందుకంటే ఆయన నారా కుటుంబానికో, నందమూరి కుటుంబానికో బంధువు కాదు కాబట్టి. అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేసిన బాబు ఇప్పటికిప్పుడు పార్టీ బాధ్యతలన్నీ ఆయనకె ఇచ్చేస్తారా.. ఇవ్వరు. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి రాష్ట్రంలో సంబంధించిన నిర్ణయాలన్నీ ఆయనే తీసేసుకుంటారా అంటే తీసుకోరు, తీసుకోనివ్వరు. అసలు చంద్రబాబు, లోకేష్ లను మించి పార్టీలో ఎవరైనా పెత్తనం చేయగలరా. అది ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ వలనే కాలేదు. అలాంటిది బయటి వ్యక్తి వలన అవుతుంది.
అంతెందుకు పాత అధ్యక్షుడు కళా వెంకట్రావుగారినే తీసుకోండి. పదవిలో ఉండగా అయన ఎఫెక్ట్ పార్టీ మీద ఎక్కడైనా కనబడిందా.. లేదు కదా. అంత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ కనుసన్నల్లోనే కదా నడిచింది. అధ్యక్షుడికైనా పార్టీని మార్చగల అపరిమిత అధికారాలు ఉంటాయని ఎలా అనుకోగలం. అధ్యక్షుడు, అధ్యక్షుడు అంటున్నారు కదా… రేపు ఎన్నికల సమయంలో అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు చూపించిన వ్యక్తులకు బాబు టికెట్లు ఇస్తారా.. ఇవ్వరు. అది చంద్రబాబు, లోకేష్ ల పరిధిలోని పని. అలాగే ప్రధానమైన పనులు, నిర్ణయాలు అన్నీ వారి ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అధ్యక్ష పదవి అనేది అచ్చెన్నాయుడుకు ఒక అలంకారం మాత్రమే. దాని ద్వారా పార్టీలో ఆయన తీసుకొచ్చే పెను మార్పులేవీ ఉండబోవు.