చెత్తబండిలో కరోనా సస్పెక్ట్..జగనన్న అంబులెన్సులు జాడెక్కడ

చెత్తబండిలో కరోనా సస్పెక్ట్..జగనన్న అంబులెన్సులు జాడెక్కడ
కరోనా మహమ్మారి మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతోంది.  మనుషుల్ని నిస్సహాయ స్థితిలోకి నెడుతోంది.  వ్యాధిగ్రస్తుల పక్కకు వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారు.  చివరికి కరోనా సోకిందేమో అనే అనుమానం వచ్చినా సరే సహాయం చేయడానికి జనం ముందుకు రావడం లేదు.  ఇలాంటి తరుణంలోనే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా విఫలమవుతోంది. ఇలాంటి అమానవీయ ఘటనే ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.  లక్షణాలతో ఇబ్బందిపడుతున్న వ్యక్తిని ఏ గత్యంతరం లేక మున్సిపాలిటీ చెత్త బండిలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సి వచ్చింది. 
 
ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామంలోని బస్టాండులో ఒక వ్యక్తి రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు.  దీంతో స్థానికులు అతనికి కరోనా సోకిందేమోనని అనుమానపడ్డారు.  అతన్ని అలాగే వదిలేస్తే చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని తలచి ఆసుపత్రిలో చేర్చడానికి అంబులెన్సుకి ఫోన్ చేశారు.  ఎన్నిసార్లు చేసినా ఆంబులెన్స్ రాలేదు.  చివరికి విసుగిపోయి ఆటోలో పంపాలని చూశారు.  కానీ ఆటో డ్రైవర్లు ఎవరూ అతన్ని ఆటోలో ఎక్కించుకోవడానికి సాహసించలేదు.  జనం కూడా సొంత వాహనాల్లో తరలించడానికి భయపడ్డారు.  ఇలా జనం వెనక్కు తగ్గడంలో వారి తప్పుందని అనలేం.  ఎందుకంటే పరిస్థితులు అలాంటివి. 
 
వైరస్ ఉన్నవారితో కాంటాక్ట్ అయితేనే సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.  అలాంటప్పుడు ప్రాణాలను ఎవరు రిస్కులో పెట్టుకోరు కదా.  అందుకే చివరకు ఆ వ్యక్తిని మున్సిపాలిటీ చెత్త బండిలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.  ఈ అమానవీయ ఘటనలో విఫలమైంది మనుషులు కాదు ప్రభుత్వ వ్యవస్థ.  స్థానికులు ఫోన్ చేసిన వెంటనే 108 అంబులెన్సు వచ్చి ఉంటే ఆ వ్యక్తికి చెత్త బండిలో పడుకుని వెళ్లాల్సిన అవసరమే ఉండేది కాదు.  కానీ అంబులెన్సు రాలేదు.  పోనీ అంబులెన్సుల కొరత ఉందా అంటే ఈమధ్యే సీఎం 1088 కొత్త 108, 104 అంబులెన్సులను ఒకేసారి ప్రారంభించారు.  ఆపదలో ఉన్నవారు ఫోన్ చేసిన వెంటనే కుయ్.. కుయ్..కుయ్ అంటూ అంబులెన్సు వాలిపోతుందని గొప్పగా చెప్పారు.  పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారు.  కానీ ఆవసరం వచ్చి ఫోన్ చేస్తే మాత్రం కనీస స్పందన లేదు.  ఇదే వ్యవస్థ వైఫల్యం అంటే.  ఈ ఘటన తెలిసిన వారు కొత్త అంబులెన్సులు ఏమయ్యాయి, అంటే అంతా పబ్లిసిటీ స్టంటేనా అంటున్నారు.