కేటీయార్ తనయుడు హిమాన్షు రాజకీయాల్లోకా.? సినిమాల్లోకా.?

KTR's Son Himanshu Rao

KTR's Son Himanshu Rao

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు హిమాన్షు రావు (టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ తనయుడు) పేరు తెలుగు నాట మార్మోగిపోతోంది. ఇటీవలే ఓ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గ్రామాభివృద్ధికి సంబంధించి అందుకున్న హిమాన్షురావు, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాతకు తగ్గ మనవడిగా.. తండ్రికి తగ్గ తనయుడిగా హిమాన్షురావు, మంచి వక్త.. అనే అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని హిమాన్షు రావు స్పష్టం చేసేశాడు. ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని హిమాన్షు తేల్చి చెప్పడం గమనార్హం. గతంలో మంత్రి కేటీయార్ కూడా.. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

విదేశాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడాలనుకున్న కేటీయార్, అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిలో, తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఎదిగిన విషయం విదితమే. ఏమో, హిమాన్షు కూడా రాజకీయాల్లోకి వస్తాడేమో. ప్రస్తుతానికైతే ఇంకా అతనిది చాలా చిన్న వయసు గనుక, రాజకీయ పరమైన ఊహాగానాలతో ఆయన్ని ఇబ్బంది పెట్టడం నెటిజన్లకు తగదు.

కానీ, తండ్రి అలాగే తాత రాజకీయాల్లో వుండడంతో.. హిమాన్షుపై ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. అందుకు తగ్గట్టే నాయకత్వ లక్షణాల్ని కూడా హిమాన్షు పుణికిపుచ్చుకున్నట్లున్నాడు. తకు రాజకీయాలు వద్దనీ, తన లక్షాలు తాను సాధించాల్సినవి చాలా వున్నాయనీ సోషల్ మీడియా వేదికగా హిమాన్షు తాజాగా వెల్లడించినా.. ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాయి గులాబీ శ్రేణులు. ఇదిలా వుంటే, హిమాన్షు సినీ రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నాడనే ప్రచారమూ లేకపోలేదు.