ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరు మారింది.. జిన్నా టవర్ పేరు మాత్రం మారలేదు. కేజీహెచ్ పేరు మార్చాలనే ఆలోచన కూడా రాలేదు. రాష్ట్రంలో ఎందరో
మహనీయులున్నారు. పింగళి వెంకయ్య, గుజరాడ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు. కానీ, ప్రభుత్వంలో వున్నవారికి ఆ పేర్లు అస్సలు గుర్తుకురావు.
సంక్షేమ పథకాలకు సొంత పేర్లు.. యూనివర్సిటీలకీ సొంత పేర్లే. దీన్ని పరిపాలన అంటారా.? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా.? అసలు ఎన్టీయార్ హెల్త్ వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది.? కేవలం వైఎస్సార్ పేరు కోసమే అయితే, కొత్తగా కడుతున్నామని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీలకు ఆ పేరు పెట్టుకోవచ్చు.
ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు.. కానీ, వైసీపీ సర్కారు ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా బోల్డంత అపప్రధ మూటగట్టుకుందన్నది నిర్వివాదాంశం. పైగా, గుంటూరులోని జిన్నా సర్కిల్ పేరు మార్చాలని పెద్దయెత్తున ఉద్యమాలు జరిగితే, ‘తగ్గేదే లే.. మార్చేదే లే..’ అనేశారు వైసీపీ నేతలు.
మార్చాల్సింది జిన్నా టవర్స్, జిన్నా సర్కిల్స్ పేర్లు తప్ప, ఎన్టీయార్ వర్సిటీ పేర్లు కానే కావన్నది నిర్వివాదాంశం. రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏవేవో చెప్పారు.. ఈ క్రమంలో ‘వైఎస్సార్‌ని ఎవరూ తలనాడలేరు..’ అని కూడా చెప్పుకొచ్చారు.
కానీ, పక్కనే వున్న మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు.. ఇలా చాలామంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తూలనాడినోళ్ళే. మంత్రి రోజా సైతం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భుజాన కండువా మారితే, ఆయా నాయకుల సిద్ధాంతాలు మారిపోతాయ్.
ఈ రోజు వైఎస్ జగన్ నిర్ణయాన్ని భళా అంటున్న వైసీపీలోని చాలామంది నేతలు, రేప్పొద్దున్న వైఎస్సార్ మీద చేయబోయే విమర్శలు ఎలా వుంటాయో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఏది ఏమైనా, పేరు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఏ మెప్పు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు.? అన్న ప్రశ్నకు వైసీపీ దగ్గర సరైన సమాధానమే లేదు. హెల్త్ యూనివర్సిటీ పేరు మారితే.. తద్వారా యూనివర్సిటీకి వచ్చే అదనపు లాభమేంటి.?