Cinema Ticket Prices : పెద్ద సినిమాలకు పెద్ద టిక్కెట్లు.. చిన్న సినిమాలకు చిన్న టిక్కెట్లు.. ఇదెక్కడి న్యాయం.? అంటూ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, తెలుగు సినీ పరిశ్రమపై సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. అందరికీ ఒకటే టిక్కెట్.. అన్నది ఏపీ ప్రభుత్వ వాదన.
పది కోట్లతో తీసే సినిమాకీ, వంద కోట్లతో తీసే సినిమాకీ ఒక్కే టిక్కెట్ ధర అంటే ఎలా.? అన్నది కొందరు సినీ ప్రముఖుల వాదనగా వుంది. ఎవరి గోల వారిది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటినా ఫర్లేదు, సామాన్యుడి వినోదం సినిమాని మాత్రం తక్కువ ధరకే అందించాలన్న వైసీపీ వాదన అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
ఇదిలా వుంటే, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాజాగా సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట. ఏ సినిమాకైనా ఒకే టిక్కెట్ ధర వుండాలనీ, రాజమౌళి లాంటోళ్ళు తీసే సాంకేతిక అద్భుతాలకు మాత్రం, వారం రోజులపాటు టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామనీ అన్నారట.
హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు ఎక్కువైపోయి, సినిమాని తక్కువ బడ్జెట్టుతోనే తీసేస్తే.. తద్వారా మొత్తం భారీ బడ్జెట్టుని చూపి, టిక్కెట్ ధరలు పెంచాలనడం భావ్యం కాదన్న భావనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సినీ పరిశ్రమ పెద్దల ముందుంచారట.
అంటే, నిన్న మొన్నటిదాకా ప్రభుత్వ పెద్దల ఆలోచనతో వున్నారో, ఇప్పుడు కూడా వారి ఆలోచన అలాగే వుందన్నమాట. ఏతావాతా చెప్పేదేంటంటే, సినిమా టిక్కెట్ల ధరలు ఏపీలో పెరిగే అవకావం లేదు. పైగా, పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలకూ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ సినీ పరిశ్రమకే చిన్నపాటి ఝలక్ ఇచ్చినట్లయ్యింది.