పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’. అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఏప్రిల్ 9వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలోకి సినిమా రానుంది. అందుకే తాజాగా సెన్సార్ పనులకు వెళ్ళింది ఫస్ట్ కాపీ. అయితే ఈ సెన్సార్ ప్రాసెస్లో సినిమాకు ఒక్కటంటే ఒక్క కట్ కూడ పడలేదట. నిజంగా ఇది విశేషమని అనాలి. ఎంతటి క్లీన్ సినిమా అయినా చిన్నా చితకా కట్స్ పడటం కామన్. స్టార్ హీరోల సినిమాలంటే సెన్సార్ మరింత పకడ్బంధీగా ఉంటుంది. ఎక్కడా అభ్యంతరం కనిపించకుండా వినిపించకుండా కత్తెర వేస్తారు సెన్సార్ బోర్డు సభ్యులు.
అందునా సినిమా చట్టాలు, కోర్టుల నేపథ్యంలో నడిచేది. కనుక ప్రాసెస్ ఇంకాస్త కష్టంగా ఉంటుంది. ఇంత క్లిష్టతలోనూ సినిమాకు ఒక్క కట్ కూడ చెప్పలేదట బోర్డు సభ్యులు. దీన్నిబట్టి సినిమా ఎంత క్లీన్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారట. అంటే చిత్రం ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని బల్లగుద్ది చెప్పవచ్చు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనూ తారాస్థాయి అంచనాలున్నాయి. సినిమా తప్పకుండా పవన్ కు మంచి రీలాంచ్ అవుతుందని భావిస్తున్నారు అందరూ.