గోదావరి నదికి కనీ వినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద కాస్తా, తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి కారణమయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన సమయంలో, పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతంలోని ఏడు మండలాల్ని, ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన విషయం విదితమే. ఆ మండలాలు అంతకు ముందు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వుండేవి.
చరిత్రలోకి తొంగి చూస్తే, ఇప్పుడు తెలంగాణలో వున్న భద్రాచలం సహా, ముంపు మండలాలన్నీ ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రంలోనివి. తూర్పుగోదావరి జిల్లాలో అప్పట్లో అంతర్భాగంగా వుండేది ఆ ప్రాంతం.
గతం గతః విభజన గాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలూ మర్చిపోయి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి వుండాల్సిన సందర్భమిది. కానీ, వరద ముంపు దెబ్బతో, మళ్ళీ విభజన పంచాయితీ తెరపైకొచ్చింది. ముంపు మండలాల్లోని ఐదు పంచాయితీలు, తమను తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేయడం గమనార్హం.
‘ఆంధ్రా వద్దు.. తెలంగాణ ముద్దు..’ అంటూ ఆ ఐదు గ్రామాల్లోనూ ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల సమయంలో తమను ఆదుకోవడంలేదన్నది వారి వాదనగా కనిపిస్తోంది. అయితే, తమ ప్రాంత ప్రజల్ని తాము ఆదుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.
ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, ఆ ఐదు గ్రామాల విషయమై తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌పైనా అలాగే కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చేందుకుకు సిద్ధమవుతుండడం గమనార్హం.