తెలంగాణలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదు.. కర్ఫ్యూ ఆలోచన అసలే లేదు..’ అని కొద్ది రోజుల క్రితం అధికారులు స్పష్టం చేశారు. మంత్రులూ తేల్చి చెప్పారు. అయితే, త్వరలో లాక్ డౌన్ తప్పదంటూ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి. ఈ మేరకు ఫేక్ జీవో ఒకటీ ఇటీవల వెలుగు చూస్తే, దాన్ని తయారు చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కానీ, తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ అనూహ్యంగా ప్రజల్ని ఆసుపత్రుల పాల్జేస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలు దాటేసి, 6 వేలకు చేరుకుంటోంది.
ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి లాక్ డౌన్ తప్ప ఇంకో అవకాశమే కన్పించడంలేదు. లాక్ డౌన్ విధిస్తారా.? ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా.? అని కోర్టు సైతం ఘాటుగా ప్రశ్నించిన దరిమిలా, తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించక తప్పలేదు. ఈ నెలాఖరు వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమల్లో వుండనుంది. నేటి నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. మే 1 తర్వాత ఏమవుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కాగా, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ రాత్రి 8 గంటలతో ముగిసిపోవాల్సి వుంటుంది. రాత్రి 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. తెల్లవారు ఝామున 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ వుంటుంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఈ సమయంలో బయటకు రావడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా రాత్రి వేళ నిబంధనల్ని గాలికొదిలి బయటకు వస్తే, కఠిన చర్యలుంటాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, దూర ప్రాంతాల బస్సులు, రైళ్ళ రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. అలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికోసం కొన్ని రవాణా సదుపాయాలు అందుబాటులో వుంటాయి. మీడియా సహా పలు అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు.