New Year Celebrations : ఒమిక్రాన్‌కి స్వాగతం పలికేందుకే న్యూ ఇయర్ వేడుకలా.?

New Year Celebrations : ఇంట్లో వుండండి.. కరోనా వైరస్‌కి దూరంగా వుండండి.. ఇది ఒకప్పటి నినాదం. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకున్నాక, దేశంలో కరోనా ప్రభావం తగ్గాక.. పర్యాటక ప్రదేశాల్ని సందర్శించండి.. పబ్బులకు వెళ్ళండి.. క్రికెట్ పోటీలను తిలకించండి.. వేడుకలూ చేసుకోండి.. అంటూ ప్రభుత్వాలు గేట్లు తెరిచేయక తప్పలేదు.

ఫేస్ మాస్కు పెట్టుకుంటే అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఫేస్ మాస్కు పెట్టుకోవడంతోపాటు, భౌతిక దూరం పాటించినప్పుడు మెరుగైన ప్రభావం వుంటుంది. కానీ, అన్ని సందర్భాల్లూ ఇవి పాటించడం సాధ్యమయ్యే వ్యవహారం కాదు.

కొత్త సంవత్సర వేడుకలకు రంగం సిద్ధమైంది. పబ్బులు గోల గోల చేసెయ్యబోతున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్ల సందడి సరే సరి. చాలా ప్రైవేటు సంస్థలు ఈవెంట్లను నిర్వహించేస్తున్నాయి.. ఈ క్రమంలో పెద్దయెత్తున జనాన్ని సమీకరిస్తున్నాయి.

చిత్రమేంటంటే.. కొత్త సంవత్సర వేడుకలు ఓ వైపు, ఒమిక్రాన్ పడగ ఇంకో వైపు.. ఒకదానితో ఒకటి పొంతన వ్యవహారాలివి. బయటకొస్తే కాటేస్తానంటోంది ఒమిక్రాన్. బయటకెళ్ళి పండగ చేసుకోమంటున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.

కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి షురూ అయ్యిందంటున్నారు. మరెలా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు ఇస్తున్నట్లు. చూస్తోంటే, ఒమిక్రాన్‌కి ఘనస్వాగతం పలికేందుకే న్యూ ఇయర్ వేడుకలా.? అన్న అనుమానం కలుగుతోంది. ఈ సంబరాలు ఎంతమందిని బలి తీసుకుంటాయో ఏమో.!