బండి సంజయ్.. ఈ పేరు ప్రస్తుతం బీజేపీలో హాట్ టాపిక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే బీజేపీ సుదీర్ఘ కలను తెలంగాణలో నెరవేర్చి చూపిస్తున్న లీడర్ ఆయన. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి లాంటి ఘనాపాటీల వల్ల కూడ కానిది బండి సంజయ్ వలన సాధ్యమైంది. బండి సంజయ్ పార్టీ పగ్గాలు అందుకున్నాక పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది. ప్రతిపక్షాన్ని అధిగమిస్తే చాలనుకుని స్థాయి నుండి అధికార పార్టీని గడగడలాడించే స్థాయికి చేరుకుంది. గతంలో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలన్నింటినీ కిషన్ రెడ్డే చూసుకునేవారు. కానీ ఆయన కేంద్ర సహాయ మంత్రిగా పదోన్నతి పొంది ఢిల్లీ స్థాయికి వెళ్లడంతో బండి సంజయ్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఆ పార్టీ నేతలు కూడ ఊహించని స్థాయిలో పనితనం ప్రదర్శించారు.
దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో పార్టీని బలంగా నిలబెట్టి అమూల్యమైన ఫలితాలు అందుకున్నారు. ఈఫలితాలు ఇచ్చిన ఊపుతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల్లోకి ముఖ్యానంగా యువతలోని చొచ్చుకెళ్లడం, కేసీఆర్, ఆయన బృందంతో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించడం లాంటివి బండి విజయవంతంగా చేయగలిగారు. సంజయ్ పనితనం పట్ల ఏకంగా ప్రధాని కూడ ఇంప్రెస్ అయ్యారు. నేరుగా బండికి ఫోన్ చేసి అభినందనాలు తెలిపారు. ఇలా బండి తిరుగులేని నేతగా ఎదిగిపోతుండటం కొందరికి నచ్చట్లేదు. ఇంతకుముందు అంటే ఎలాంటి ప్రభావం చూపని పార్టీలో ముందుంటే ఎంత వెనకుంటే ఎంత అనేలా ఉండేది వ్యవహారం. కానీ బీజీపీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. అందుకే తెరచాటు రాజకీయం మొదలైంది.
మొదట నుండి రాష్ట్రంలో పార్టీని కాచుకుని ఉన్న కిషన్ రెడ్డి ఎప్పటికీ తానే సుప్రీం అనే ధోరణి ఉంది. ఈ నేపథ్యంలో తర్వాతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయమై చర్చ మొదలైంది. పార్టీని తక్కువ కాలంలోనే ఈ స్థాయికి తీసుకొచ్చింది బండి సంజయ్ కాబట్టి అనే సీఎం క్యాండిడేట్ అని కొన్ని వర్గాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. దీంతో కిషన్ రెడ్డి వర్గంలో అలజడి మొదలైంది. ఊరుకుంటే పార్టీ పగ్గాలు చేయి దాటిపోతాయని భావించి కొత్త ప్రచారం షురూ చేశారట. అదేమిటంటే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని. బండి సంజయ్ గనుక ఇదే రీతిలో పార్టీని ముందుకుతీసుకెళితే అధిష్టానం అనుమానం లేకుండా ఆయన్నే క్యాండిడేట్ అంటుంది. అందుకే ఇప్పటి నుండే కిషన్ రెడ్డి వర్గం కిషన్ రెడ్డే ఫ్యూచర్ సీఎం అనే ప్రచారం మొదలుపెట్టారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. బండి వర్గం కూడ ఈ విషయంలో తగ్గట్లేదట. నేరుగా కాకపోయినా పరోక్షంగా బండి సంజయ్ పేరును గట్టిగా ఎలివేట్ చేస్తున్నారట.