CM Ys Jagan : స్వామి భక్తి అనేది రాజకీయాల్లో నిత్యం చూస్తూనే వుంటాం. అధినేత మెప్పు కోసం నాయకులు ఏ స్థాయికైనా దిగజారిపోతారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాలే లేవు. అన్ని పార్టీల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది.
జాతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు.. ఇలా ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు.
తనకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి పాదాభివందనం ఎవరైనా చేస్తే అది తప్పెలా అవుతుంది.? కానీ, పదవి ఇచ్చిన అధినేతకు పాదాభివందనమో, సాష్టాంగ దండ ప్రమాణమో.. చేస్తే చేయొచ్చుగాక.. అది ప్రైవేటు కార్యక్రమాల్లో బాగానే వుంటుంది.
తమకంటే వయసులో చిన్నవాళ్ళకు నమస్కరించడమంటే అది ఆ చిన్నవారికి ఆయుక్షీణం. ముఖ్యమంత్రి అయినాసరే.. వయసులో తమకంటే చిన్నవాడైనప్పుడు.. కాళ్ళకు నమస్కరించడమంటే అంతకన్నా దారుణం ఇంకోటుండదు. అధినేత ఇలాంటివి కోరుకుంటారా.? అన్నదే అసలు సమస్య.
కానీ, రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమైపోయాయ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త క్యాబినెట్ ఈ రోజు పదవీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో.. పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయడం చర్చనీయాంశమయ్యింది.
తమకు ఆ అవకాశమిచ్చిన ముఖ్యమంత్రికి ఇంటికి వెళ్ళి పాదాభివందనం చేస్తే దాన్నెవరూ తప్పుపట్టరుగానీ, అందరూ చూస్తుండగా నమస్కారాలు పెట్టడమంటే దాన్ని ‘అతి’గానే భావించాలి. ఇవి పబ్లిసిటీ నమస్కారాలు తప్ప, చిత్తశుద్ధితో చేసినవి కానే కావు.