ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీకి అతీగతీ లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ తన ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగైపోతుంది అని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఓ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఉండేది గతంలో అని చెప్పుకోవాలి. మన పిల్లలకు చెప్పాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి భారతదేశంతో ఎంతో అనుబంధం ఉంది. దశాబ్దాల పాటు భారతదేశాన్ని ఏలిన పార్టీ అది. కానీ.. సరైన నాయకులు లేక పార్టీ నామరూపం లేకుండా పోతోంది.
ఇక.. జాతీయ స్థాయిలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న పార్టీ అంటే బీజేపీ ఒక్కటే. దాన్ని ఢీకొట్టే పార్టీ మరోటి లేదు. మరో జాతీయ పార్టీకి స్పేస్ ఉంది. కానీ.. ధైర్యం చేసి జాతీయ పార్టీని నెలకొల్పి బీజేపీకి గట్టిపోటీని ఇచ్చేలా ఎవరు చేయగలరు.
నేనున్నాను.. అంటూ ముందుకొస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అవును.. బీజేపీని ఢీకొట్టడమే తన ధ్యేయంగా ముందుకు పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్.
2024 సాధారణ ఎన్నికలే ధ్యేయంగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇదివరకే 2018 ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూశారు. తృతీయ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిమీదికి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు.
కానీ.. ఈ సారి సింహం సింగిల్ గానే దిగుతోంది. జాతీయ పార్టీని తానే స్థాపించి.. దాన్ని బీజేపీకి ప్రత్యామ్నాయంగా తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నయా భారత్ పేరుతో జాతీయ పార్టీని స్థాపించడానికి సీఎం కేసీఆర్ సమాయత్తమవుతున్నారట.
పార్టీ పేరు.. నయా భారత్ అని ఎప్పుడో ఫైనల్ చేసేశారట. ఇక.. పార్టీ పేరును రిజిస్టర్ చేయించి… జాతీయ రాజకీయాల్లోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో ఎలాగూ తన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్ర బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేసి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి కేసీఆర్ సిద్ధపడుతున్నారట.
అయితే.. బీజేపీ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు సెట్స్ మీదికి వెళ్తే… 2022 లో లేదా 2023లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అందుకే… అయితే జమిలి ఎన్నికలు.. లేదంటే 2024 సాధారణ ఎన్నికలు.. వీటినే టార్గెట్ చేసుకొని.. ఆదిశగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
అయితే.. సొంతంగా జాతీయ పార్టీ పెట్టి.. ఇతర పార్టీలను తన పార్టీకి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరుతారా? లేక ఒంటరిగానే ప్రజల మద్దతుతో బీజేపీని ఢీకొంటారా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇప్పటికే కేసీఆర్.. పలు ప్రాంతీయ పార్టీలతో సన్నిహితంగా ఉంటున్నారట. వాటి మద్దతు తనకు భవిష్యత్తులో కావాలన్న ఉద్దేశంతో వాటితో మంచిగా ఉంటూ ఎన్నికల సమయానికి తన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే.. కేసీఆర్ బీజేపీ పార్టీపై ఎక్కడ దొరికితే అక్కడ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా నిలదీస్తున్నారు. ఆ విషయాల్లో కేసీఆర్ సక్సెస్ అవుతున్నారు. దేశ ప్రజల్లో కూడా బీజేపీపై వ్యతిరేకత ప్రారంభం అవుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో దేశ ప్రజలకు ఏమాత్రం ప్రభుత్వం అండగా లేదన్న అపవాదు బీజేపీపై ఉంది. దాన్ని క్యాష్ చేసుకొని.. ఆదిశగా దేశ ప్రజలకు చేరువవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.