కొన్నేళ్లగా తెలంగాణ రాష్ర్టంలో మావోయిస్టుల కదలిక లేదు. అప్పుడప్పుడు అడవుల్లో అలజడి చోటు చేసుకున్నా అంతరాష్ర్ట సరిహద్దులకే పరిమితం. కానీ ఇటీవల కాలంలో తెలంగాణలో మావోల కదలిక మళ్లీ మొదలైంది. ఇప్పుడీ కదలిక పై కలకలం రేగుతోంది. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్ట్లు లు పెద్ద ఎత్తున సంచరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఖమ్మం, అదిలాబాద్, వరంగల్ సహా నల్లమల అడవుల్లో కదలికల జోరు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్ట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. డిజీపీ మహీంధర్ రెడ్డి స్వయంగా అసిఫాబాద్, ములుగు, భద్రాది, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.
రెండుసార్లు నక్సల్స్ పోలీసుల కంటపడి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసీఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లో 600 మంది పోలీసులు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ కీలక నేత సహా పెద్ద టీమ్ తెలంగాణ అడవుల్లో మాటు వేసినట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు. వీళ్లంతా పెద్ద ప్లాన్ తోనే, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి రంగం సిద్దం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల అటవీ ప్రాంతాల పోలీసుల్ని అలెర్ట్ చేసారు. ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహించాలని డీజీపీ అదేశాలు జారీ చేసారు. కొన్నేళ్లగా నక్సల్స్ హడావుడి రాష్ర్టంలో లేదు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక మావోల హడావుడి పూర్తిగా తగ్గిపోయింది. చిలవలు పలవులుగా రాష్ర్ట సరిహద్దుల్లో హడావుడి జరిగినా ఎలాంటి ఎన్ కౌంటర్లు చోటు చేసుకోలేదు. కానీ తాజాగా తెలంగాణ మళ్లీ మావోలు రంగంలోకి దిగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నక్సల్స్ మళ్లీ ఎలాంటి చర్యలకు దిగుతారోనన్న టెన్షన్ కొంత మంది ప్రజా ప్రతినిధుల్లో మొదలైనట్లు సమాచారం.