సీనియర్ నటుడు నరేష్ రోజు రోజుకీ తన ‘అతి’ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళేందుకే ప్రయత్నిస్తున్నాడు. ఎందుకిలా.? ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) విషయంలో ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది. వెయ్యిమంది సభ్యులు.. అందులో ఎంతమంది సినిమాల్లో యాక్టివ్‌గా వున్నారు.? అందులో ఎంతమంది ఎన్నికల పట్ల ఆసక్తితో వున్నారు.? ఇవన్నీ బహిరంగ రహస్యాలే.
తన హయాంలో ‘మా’ అత్యద్భుతంగా వెలిగిపోయిందని ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్ చెప్పుకుంటున్నాడు. కానీ, ‘మా’ భవనం ఎంతవరకు ఎందుకు నిర్మితం కాలేదన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు. నరేష్ హయాంలో ‘మా’ కేంద్రంగా చాలా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందెన్నడూ ‘మా’ విషయంలో ఇలాంటి ఆరోపణ రాలేదు.
‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు గెలుపులో నరేష్ కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. నేనే రథ సారధిని.. అని చెప్పుకుంటున్నాడాయన. అందులో కొంత నిజం వుండి వుండొచ్చుగాక. కానీ, ఇప్పుడు ‘మా’ పగ్గాలు మంచు విష్ణు చేతికి వచ్చాయి. ఇంకా తానే చక్రం తిప్పుతానని నరేష్ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఎటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారు రాజీనామా చేశారు గనుక, తనకూ ఏదో పదవి వస్తుందని నరేష్ కక్కుర్తి పడుతున్నాడేమోనన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది. నిజానికి, సినీ పరిశ్రమలో రాజకీయాలకు తావుండకూడదు. అది పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకం చేసుకుంది.
అయితే, ‘మా’ అంటే, మొత్తం సినీ పరిశ్రమ కాదు. ‘మా’ అంటే నటీనటుల సంఘం. తెలుగు సినిమాల్లో నటిస్తున్నవారంతా ‘మా’లో సభ్యులు కారు. అలాంటప్పుడు, నరేష్ ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నట్లు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఆయన ఎవర్నో సవాల్ చేస్తున్నాడు.. ఎందుకు అలా చేస్తున్నాడో ఆయనకైనా తెలుసా.?