రాజకీయాల్లో రాజకీయ విమర్శలు సర్వసాధారణమే కావొచ్చు. కానీ, వాటికీ కొన్ని పరిమితులు వుంటాయి. మరీ ముఖ్యంగా అధికారుల్ని ఉద్దేశించి, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో వున్నవారిని ఉద్దేశించి కులపరమైన విమర్శలు చేయడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఆ పని ఎవరు చేసినా, వ్యవస్థలు తగు రీతిలో స్పందించాల్సిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పోలీస్ ఉన్నతాధికారి అమ్మిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా. తమ పార్టీకి చెందిన కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేయడమే నారా లోకేష్ ఆగ్రహానికి కారణం. సోషల్ మీడియాలో కామెంట్లు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు టీడీపీ కార్యర్తల్ని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా, ఆ వ్యవహారంపై మండిపడ్డ లోకేష్, కులం పేరుతో ఎస్పీ అమ్మిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేనా, ‘సిగ్గులేదా’ అంటూ అమ్మిరెడ్డిని ప్రశ్నించడం గమనార్హం. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ హయాంలోనూ పోలీసు అధికారులపై ఈ తరహా ఆరోపణలు వైసీపీ నుంచి వినిపించాయి. అంతమాత్రాన తాము కూడా అలాగే వ్యవహరిస్తామని టీడీపీ అనుకుంటే ఎలా.? గతంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కులం పేరుతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపణలు చేయడం అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. అప్పట్లో ఆ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన టీడీపీ, ఇప్పుడు ఎస్పీ అమ్మిరెడ్డి విషయంలో నారా లోకేష్ వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా.? బాధ్యతగల పదవుల్లో వున్న వ్యక్తులు అధికారులపై విమర్శలు చేసే సమయంలో బాధ్యాయుతంగా వ్యవహరించాలి. గతంలో మంత్రిగా పనిచేసిన లోకేష్, ఇలా ఎలా మాట్లాడగలుగుతారు.? ఇప్పుడిక పోలీసులు తగిన చర్యలు లోకేష్ మీద తీసుకుంటే, ‘వేధింపులు’ అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని టీడీపీ తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో