Nara-Daggubati : నారా – దగ్గుబాటి.. సంబంధం కలిసినట్టుందే.!

Nara-Daggubati :స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవరాలి వివాహానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. ఇందులో వింతేముంది.? చంద్రబాబు, దగ్గుబాటి.. ఇద్దరూ స్వర్గీయ ఎన్టీయార్‌కి అల్లుళ్ళే కదా.!

రాజకీయాలు ఎలా వున్నా, నందమూరి కుటుంబమంతా ఒక్కతాటిపైనే వుంటుందని పలు సందర్భాల్లో నందమూరి కుటుంబ సభ్యులు నిరూపించారు. అయితే, నారా చంద్రబాబునాయుడితో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆప్యాయంగా కలిసిమెలిసి వున్నది ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేదు.

కారణం అందరికీ తెలిసిందే.. స్వర్గీయ ఎన్టీయార్‌కి రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వ్యవహారంలో కీలక పాత్ర వహించింది చంద్రబాబు, దగ్గుబాటి. అయితే, దగ్గుబాటి తన తప్పుని తెలుసుకున్నారు.. అలా తెలుసుకోవడానికిన చంద్రబాబు, దగ్గుబాటి ఇచ్చిన ఝలక్కే కారణం.

ఇటీవల చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దగ్గుబాటి పురంధరీశ్వరి స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యల్ని ఖండించారు. స్వర్గీయ ఎన్టీయార్ తమను విలువలతో పెంచారని అన్నారామె.

ప్రస్తుతం దగ్గుబాటి పురంధరీశ్వరి బీజేపీలో కీలక నేతగా వున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు వెళ్ళారుగానీ, కొన్ని కారణాలతో ఆ తర్వాత ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేరాయన.

మొత్తమ్మీద, దగ్గుబాటి – నారా కలయిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యిందన్నమాట. దీన్ని రాజకీయ కలయికగా చూడొచ్చా.? కేవలం కుటుంబ కలయికగానే చూడాలా.?