ప్రస్తుతానికి తెలంగాణలో ఇంకా షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన జరగాల్సి వుంది. ఏప్రిల్ 9వ తేదీన పార్టీ ప్రకటితమవుతుంది. ఇంకోపక్క, రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన ఓ అభ్యర్థి నామినేషన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ అభ్యర్థి షర్మిల పెట్టబోయే పార్టీ సానుభూతిపరుడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బరిలో ఆ వ్యక్తి చివరిదాకా వుంటారా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. ఇదిలా వుంటే, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్.. షర్మిల పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళుతుంది.? ఎవర్ని ఇబ్బంది పెడుతుంది.? అన్నదానిపై కిందా మీదా పడుతున్నాయట.
ప్రధానంగా ఓ మతానికి సంబంధించిన ఓట్లు షర్మిల పెట్టబోయే పార్టీకి ప్రధాన బలంగా చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ప్రస్తావనలు సబబు కాకపోయినా, ప్రస్తుత రాజకీయాల్లో కులం, మతం.. ప్రాతిపదికనే అన్నీ జరుగుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి. అయితే, షర్మిల పార్టీ ఎఫెక్ట్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే వుంటుందన్నది కాంగ్రెస్ విశ్లేషణ. అసలు షర్మిల పార్టీని తాము పట్టించుకోవడంలేదని బీజేపీ చెబుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం పరిస్థితుల్ని జాగ్రత్తగా విశ్లేషిస్తోంది. ‘ఆంధ్రా పార్టీ’ అనే ముద్రను షర్మిల పెట్టబోయే పార్టీపై ముందుగానే తెలంగాణ రాష్ట్ర సమితి వేసేస్తున్నా, తెరవెనుక లోపాయకారీ ఒప్పందాలు నడుస్తున్నాయనే గుసగుసలూ లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంతవరకు షర్మిల ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలూ చేయలేదు. దాంతో, షర్మిల మద్దతుదారులు ఆమె నుంచి సరైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయట. ఖచ్చితంగా షర్మిల పార్టీ ఓటు బ్యాంకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎవర్నో దెబ్బకొట్టడమో, ఇంకెవరికో విజయాన్ని అందించడమో చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.