‎Nagarjuna: కెరిర్ లో మొదటిసారీ కథ చెప్తే రికార్డు చేసుకున్నాను.. నాగార్జున కామెంట్స్ వైరల్!

‎Nagarjuna: హీరో రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో తెరకెక్కిన కూలీ సినిమా ఆగస్టు 14 విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్ లో నటించారు. అలాగే ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా నాగార్జున, సత్యరాజ్, లోకేష్ కానగరాజ్, శృతి హాసన్ హాజరయ్యారు.

‎ఈ ఈవెంట్లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నిన్నే పెళ్లాడతా చేసిన తర్వాత అన్నమయ్య చేస్తుంటే ఇప్పుడెందుకు ఇలాంటి కథ అని అన్నారు. నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌ కు వెళ్లాక బోర్‌ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. అందుకే ఇప్పుడు నెగిటివ్ రోల్ చేశాను. లోకేశ్‌ నన్ను కలిసి మీరు విలన్‌ గా చేస్తానంటే మీకో కథ చెబుతాను. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా అని అన్నారు.

‎లోకేష్ ఖైదీ చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని అనుకున్నాను. కూలీ కథ చెప్పిన తర్వాత రజనీ సర్‌ ఈ కథ ఒప్పుకొన్నారా అని అడిగాను. ఈ కథలో నా పాత్ర ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్ ని ఈక్వెల్ గా చూపిస్తాడు. నా కెరీర్‌ లో మొదటిసారి లోకేశ్‌ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నాను. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నాను. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పాను. నేను చెప్పిన చేంజెస్ చేసి సైమన్‌ పాత్రను లోకేశ్‌ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. రజనీ సర్‌ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా. వైజాగ్‌ లో మా ఫస్ట్‌ షూట్‌ జరిగింది.

ఈ సినిమాను నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. కానీ వాళ్లు ఇచ్చిన బడ్జెట్‌ లో 5కోట్లు మిగిల్చి మరీ లోకేశ్‌ సినిమా పూర్తి చేశాడు. షూట్‌ సమయంలో ఆరు కెమెరాలతో పనిచేస్తాడు. షూటింగ్‌ సమయంలో రజనీ సర్‌ స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌ కు చెప్పేవాడిని అని సరదాగా అన్నారు. థాయ్‌లాండ్‌ లో 17 రోజుల పాటు రాత్రి పూట యాక్షన్‌ సీక్వెన్స్‌ తీశాము. 350మందికి పైగా చాలా కష్టపడ్డాము. చివరి రోజు మొత్తం అందరినీ రజనీ సర్‌ పిలిచి తలో ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి పంపారు అని తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.